ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి

Telangana: Karimnagar Collector Karnan With Dalit Beneficiaries - Sakshi

దళితబంధు లబ్ధిదారులతో కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్‌

యూనిట్ల ఎంపికపై కలెక్టరేట్‌లో అవగాహన సమావేశం  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్‌ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు.

యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్‌ ట్రెయిలర్, ట్రాక్టర్‌ ట్రెయిలర్, కారు, సూపర్‌ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్‌ ఎంపోరియం యూనిట్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్‌ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్‌డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్‌ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్‌ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్‌లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్‌ మిల్క్, బాదాం మిల్క్‌ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్‌ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top