రాష్ట్రాన్ని తడిపిన తపన! 

Telangana Increased Acreage Of Irrigated Land - Sakshi

ప్రాజెక్టులపై రూ.1.52 లక్షల కోట్ల వ్యయం 

1.31 కోట్ల ఎకరాల నుంచి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం 

రీడిజైనింగ్, రీ ఇంజనీరింగ్‌తో అద్భుత ఫలితాలు.. ప్రగతినివేదికలో సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పచ్చబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరకాల కల సాకారమయ్యే క్రమంలో రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన సత్ఫలితాలిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతరీతిలో సాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. రీడిజైనింగ్, రీ–ఇంజనీరింగ్‌ చేపట్టడంతో ప్రాజెక్టులన్నీ కొత్తరూపు సంతరించుకున్నాయి.

దీంతో సాగునీటి విస్తీర్ణం పెరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల ప్రాజెక్టుల పూర్తితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా–కొరాటా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్‌ వంటి ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఏకంగా రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రగతినివేదికలో ఈ విషయాలను పేర్కొంది.  

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం ముందు తీరం నుంచి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ చేయాలన్న లక్ష్యంతో రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి.  6 జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో గల 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. 

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు
గోదావరి నీటిని తరలించి భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేసి రాష్ట్రంలో బీడువారిన భూములకు అందించడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ. పొడవున సొరంగాలు, పైప్‌లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్‌ను కేవలం 36 నెలల రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరందిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరంగా 100 టీఎంసీల జలాలను నిల్వ చేయవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top