అమెరికాకూ మన ‘రెక్కలు’

Telangana: Hyderabad Hub For Global Defence OEMs: KTR - Sakshi

‘ఫైటర్‌ వింగ్స్‌’ తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

ఆదిబట్లలోని టీఎల్‌ఎంఏఎల్‌లో తయారైన ‘ఎఫ్‌–16’ నమూనా రెక్క

విదేశీ సంస్థకు అప్పగింత.. పాల్గొన్న మంత్రి  

ఇబ్రహీంపట్నం రూరల్‌: అమెరికాకు చెందిన ఎఫ్‌–16 రకం యుద్ధవిమానాలు మేడిన్‌ హైదరాబాద్, మేడిన్‌ ఇండియా రెక్కలు (ఫైటర్‌ వింగ్స్‌) తొడుక్కోనుండటం గర్వకారణమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. ఈ రెక్కల తయారీలో ఉపయోగించే పరికరాల్లో 70 శాతం భారత్‌వే కావడం విశేషమన్నారు. ఫైటర్‌ వింగ్స్‌ తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ గుర్తింపు సాధించడం అభినందనీయమన్నారు.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఏరోస్పేస్‌ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌ భారత్‌లో తమ అనుబంధ సంస్థ టాటా–లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌)ను ఎఫ్‌–16 యుద్ధవిమానాల రెక్కల తయారీ సహ భాగస్వామిగా లాంఛనంగా గుర్తించింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న టీఎల్‌ఎంఏఎల్‌ కేంద్రం తమ మొట్టమొదటి నమూనా యుద్ధవిమాన రెక్కను తయారు చేసి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌–ఐపాస్‌ విధానం ద్వారా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. టాటా అడ్వాన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ ఎండీ సీఈఓ సుకరణ్‌సింగ్‌ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంలో విజయవంతంగా ఫైటర్‌ వింగ్‌ను తయారు చేయగలిగామన్నారు.

ఈ కార్యక్రమంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బిల్‌ బ్లెయిర్, వైస్‌ ప్రెసిడెంట్‌ కంబాట్‌ ఎయిర్, ఇంటిగ్రేటెడ్‌ పైటర్‌ గ్రూప్‌ ఐమీ బర్నెట్, యుఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌ ) జోయెల్‌ రీఫ్‌మాన్‌లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top