
అక్రమ నిర్మాణం ముందు ఇలా హోర్డింగు ఏర్పాటుకు ఆదేశాలిస్తాం
అప్పుడు ఎవరూ కొనరు.. నిర్మాణం నిలిపివేస్తారు
లేకుంటే అనధికారిక నిర్మాణాల ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది
హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..అక్రమ నిర్మాణం కూల్చివేయకపోవడంపై సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనధికారిక భవనాలకు ‘ఇది అనుమతి లేని నిర్మాణం’ అంటూ స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు భవనం ముందు బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసేలా ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో రెండు ప్రయోజనాలుంటాయని..అది ఒక వేళ బహుళ అంతస్తుల నిర్మాణం, అపార్ట్‌మెంట్ అయితే ప్రజలు ఎవ రూ కొనుగోలు చేయరని, వ్యక్తిగత ఇల్లు అయితే పరువు కోసమన్నా అక్రమ నిర్మాణాన్ని నిలిపివేస్తారని స్పష్టం చేసింది. లేకుంటే అనధికారిక నిర్మాణాల ప్రహసనం ఇలానే కొనసాగుతూ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజా కేసులో వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. హైదరాబాద్ మహరాజ్‌గంజ్ తోటగూడలోని అనధికారిక భవనానికి స్పీకింగ్ ఆదేశాలు (నోటీసులు) జారీ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారవేత్త జి.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే కూల్చివేతకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర్వులకన్నా బోర్డుల ఏర్పాటే ఉత్తమం
‘అక్రమ నిర్మాణాల ముందు స్పీకింగ్ ఉత్తర్వులతో హోర్డింగులు, బోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పుడే అనధికారికంగా నిర్మాణాలు చేపట్టే వారికి తెలిసొస్తుంది. చుట్టుపక్కల వాళ్లు అడుగుతారనే భయంతో కూడా నిర్మాణాలు నిలిపివేస్తారు. అలాగే భవనం ముందు బోర్డు ఉంటుంది కనుక మాకు తెలియకుండా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశామని ఎవరూ చెప్పరు. న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వుల కంటే ఇది సత్ఫలితాలిస్తుంది. ఆ మేరకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. అలాగే అసమర్థులైన ప్రభుత్వ అధికారులపై ఆధారపడటం కంటే ప్రజలు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేసుకోవడం మంచిది. ఎవరికి వారు చట్టప్రకారం రక్షణ చర్యలు ఎలా తీసుకోవచ్చో నేర్చుకోండి..’అని న్యాయమూర్తి సూచించారు.
అక్రమార్కుల్లో భయం పోతోంది..
‘స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ప్రజలంతా కోర్టుకు వచ్చేవరకు ఎందుకు ఆగుతున్నారు? కోర్టు ఆదేశాలిచ్చినా వాటి అమలుకు తాత్సారం చేస్తున్నారు. కూల్చివేత, సీజ్ లాంటి చర్యలు వెంటనే ఎందుకు తీసుకోవడం లేదు?.. రానురాను పోలీసు, కోర్టు, అధికారులంటే అక్రమాలు చేసిన వారిలో భయం పోతోంది. సోషల్ మీడియా అంటే మాత్రం బెదిరిపోతున్నారు.
అధికారుల మైండ్‌సెట్ మారడం లేదు..
జీహెచ్‌ఎంసీ అధికారులకు మంచి సాఫ్ట్‌వేర్, కంప్యూటర్లు, అద్భుత భవనాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది. సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి పేరుంది. అయినా పని తీరు మారడం లేదు. అధికారులు మారుతున్నారు తప్ప వారి మైండ్‌సెట్ మాత్రం మారడం లేదు. మున్సిపల్ అధికారులే కాదు.. వారిని వెనకేసుకొచ్చే స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా అలానే ఉన్నాయి. కోర్టులు వందల కొద్దీ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేస్తుంటారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడినా.. వారి పరువు పోవద్దని ఆలోచిస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు ఏర్పాటుకు ఆదేశాలివ్వాల్సి వస్తుంది..’అని న్యాయమూర్తి హెచ్చరించారు.