Telangana Govt: ‘పోలీస్‌’ కటాఫ్‌ మార్క్‌ ఇదే..

Telangana High Court disposes Petitions against uniform cutoff Marks - Sakshi

ఓసీలకు 60, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీలకు 40గా నిర్ణయించాం

హైకోర్టుకు వెల్లడించిన ప్రభుత్వం

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వేసిన పిటిషన్‌లను కొట్టివేసిన ధర్మాసనం

ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలకు కటాఫ్‌ మార్క్‌ వర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించనున్న పోలీస్‌ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ మార్క్‌గా 40 మార్కులను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 200 మార్కులకు బీసీలకు 50, ఓసీలకు 60 కటాఫ్‌ మార్కులుగా పేర్కొంటూ తాజాగా జీవో విడుదల చేసింది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80 (40%), బీసీలకు 70(35%), ఎస్సీ, ఎస్టీలకు 60 (30%)గా ఉండేది. అయితే ఎస్సై, కాని స్టేబుల్‌ ఎగ్జామ్‌ రాసిన వారికి కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్, టీఎస్‌ ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 30% మార్కులు సాధిస్తే వారు అర్హత సాధిస్తారని ప్రకటించింది. దీంతో జనరల్‌ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీలకు సైతం 30% మార్కులను కటాఫ్‌గా పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని హైకోర్టులో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం కొత్త కటాఫ్‌ మార్కులను ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిల్ల రమేశ్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పిటిషనర్లకు ఆమోదయోగ్యంగా ఉండటంతో ధర్మాసనం వాదనలు ముగించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top