నిర్మల్‌: బురద మిగిల్చిన వరద

Telangana Heavy Rains Floods Damage Adilabad Nirmal District - Sakshi

నిర్మల్‌ జిల్లాలో బోరుమంటున్న జనం

నీట మునిగిన సామగ్రి, నిత్యావసరాలు

తెగిపోయిన చెరువు కట్టలు.. దెబ్బతిన్న రోడ్లు

నిండా మునిగిన పంటపొలాలు

చేపలు పట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి

నిర్మల్‌: ‘‘పొద్దున ఏడున్నరకు నిద్రలేచి బయటికి వస్తే ఇంటి చుట్టూ నీళ్లే.. అందరినీ నిద్రలేపే సరికి ఇంట్లోకీ వస్తున్నయ్‌. పిల్లలను తీసుకుని పైఅంతస్తుకు పోయినం. చుట్టూచూస్తే సముద్రం లెక్కనే ఉన్నది. అందరూ ఇండ్లపైకి ఎక్కిన్రు. ఉంటమా.. పోతమా అని ప్రాణాలు అరచేతిల పెట్టుకుని ఉన్నం. ఇంట్లో వస్తువులు, బట్టలు, బియ్యం, పప్పులు, డబ్బాలు అన్నీ మునిగిపోయినై. చెప్పడానికి మాటలస్తలేవు’’..  నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్‌ కాలనీకి చెందిన కృష్ణవేణి ఆవేదన ఇది.

ఇళ్లన్నీ నీటమునగడంతో వంద కుటుంబాలకుపైగా బోరుమంటున్నాయి. వరద తగ్గడంతో శుక్రవారం ఉదయం వారు తమ ఇళ్ల వద్దకు వచ్చారు. వరద మిగిల్చిన బురద, దెబ్బతిన్న వస్తువులు, సామగ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా వరద భారీ నష్టాన్ని మిగిల్చింది. తెగిపోయిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, నిండా మునిగిన పంటలతో అతలాకుతలమైంది. నిర్మల్‌ పట్టణంలోని బాధిత కాలనీలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్, ఇతర అధికారులు శుక్రవారం పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

కాపాడిన జాలర్లు
వరద బాధితులకు స్థానిక జాలర్లే దేవుళ్లుగా మారారు. తెప్పలు తీసుకుని నీట మునిగిన కాలనీలకు వెళ్లారు. పోలీసుల సాయంతో ఒక్కొక్కరినీ క్షేమంగా బయటికి తీసు కొచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిర్మల్‌ చేరుకునేసరికే చాలా మందిని కాపాడారు. జిల్లాలోని భైంసా మండలం గుండెగాంలో పలు ఇండ్లు కూలిపోయాయి. బాధితు లంతా తమకు పునరావాసం కల్పించా లంటూ భైంసాలోని జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. కాగా.. జిల్లా కేంద్రంలో చేపలు పట్టడానికి వచ్చిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు.

భారీగా నష్టం
నిర్మల్‌ జిల్లాను ముంచెత్తిన జడివాన, వరద భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారులు శుక్రవారం ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. జిల్లాలో 24,100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 32 చెరువులు తెగాయి. సరస్వతి, స్వర్ణ, సదర్‌మాట్, గడ్డెన్నవాగు కెనాల్స్‌ 28 చోట్ల దెబ్బతిన్నాయి. వీటికి రూ.10 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. 18 మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వీటికి రూ.75 కోట్లు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. విద్యుత్‌ శాఖ పరిధిలో 800కుపైగా స్తంభాలు, 180 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నీట మునిగిన కాలనీల్లో రూ.20 కోట్లకుపైనే నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top