బోధనాస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు 

Telangana Health Department Takes Strong Measures To Control Infections In Educational Institutions - Sakshi

ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ.. స్టెరిలైజేషన్‌ యంత్రం, స్టీమ్‌ స్టెరిలైజర్‌ల ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌:  అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్‌ నియంత్రణ కమిటీ (హాస్పిటల్‌ ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ –హెచ్‌ఐసీసీ)లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లేదా అధిపతి కమిటీకి చైర్‌ పర్సన్‌గా.. మైక్రో బయాలజీ హెడ్‌ లేదా సీనియర్‌ మైక్రోబయోలజిస్ట్‌ లేదా సీనియర్‌ డాక్టర్‌ సభ్య కార్యదర్శిగా, ఆర్‌ఎంవో లేదా నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ లేదా ఆపరేషన్‌ థియేటర్, ఐసీయూ ఇన్‌చార్జి, ఆపరేషన్‌ థియేటర్లు, సెంట్రల్‌ స్టెరిలైజేషన్‌ డిపార్ట్‌మెంట్, హౌస్‌ కీపింగ్, శానిటేషన్, లాండ్రి, ఇంజనీరింగ్, ఫార్మకాలజీ, ఫార్మసీ, స్టోర్స్, మెటీరియల్‌ సప్లై విభాగాల నుంచి తదితరులు సభ్యులుగా ఉంటారు.

సర్జికల్, మెడికల్, అనస్తీషియా తదితర విభాగాలకు చెందిన అధిపతులు ప్రతినిధులుగా ఉంటారు. 100 పడకల వరకు ఉన్న ఆస్పత్రుల్లో ఒకరు, ఆపైన పడకలు ఉన్న ఆస్పత్రుల్లో ఇద్దరు ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ నర్సులు ఉంటారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. 

ఇన్ఫెక్షన్‌ నియంత్రణ కమిటీల విధులివీ..

 • కనీసం వారానికోసారి సమావేశమై ఆస్పత్రిలో నిబంధనల మేరకు ఇన్ఫెక్షన్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నారా లేదా సమీక్షించాలి 
 • పరికరాల స్థితి, రసాయనాలు, డిస్పోజబుల్స్, లాండ్రీ మొదలైన వాటిని సమీక్షించాలి. ఇన్ఫెక్షన్‌ నియంత్రణకు సంబంధించి స్టెరిలైజేషన్‌ కెమికల్స్, పీపీఈల నిల్వలను పరిశీలించాలి. 
 • ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లలో బయో మెడికల్, వైద్య వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉందా లేదా చూడాలి. వివిధ రకాల గదులు, ఐసీయూఎస్, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డుల్లో ఇన్ఫెక్షన్‌ నియంత్రణలను సమీక్షించాలి. అంటు వ్యాధులకు కారణాలు, వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్‌లలో ఏమైనా లోపాలున్నాయా గుర్తించాలి. 
 • ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూల్లో యాంటీ బయాటిక్‌ పాలసీ, యాంటీ బయాటిక్‌ స్టీవార్డ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను సమీక్షించాలి. 
 • యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్, హాస్పిటల్‌ అక్వైర్డ్‌ ఇన్ఫెక్షన్‌లపై నిఘా ఉంచాలి. 
 • ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూలు, ఇతర గదుల్లో శస్త్రచికిత్స అనంతరం వార్డుల్లో ప్రామాణిక స్టెరిలైజేషన్‌ పద్ధతులను పాటించాలి. 
 • అన్ని ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు ఇన్‌చార్జి నర్సులు సూక్ష్మజీవుల విశ్లేషణ కోసం స్వాబ్స్‌/గాలి నమూనాలను పరీక్షలకు పంపాలి. 
 • బయో మెడికల్‌ వ్యర్థాలను పారవేసే ఆస్పత్రి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలి. నిరీ్ణత ప్రొటోకాల్‌ ప్రకారం వైద్య పరికరాలను సరిగా క్రిమిరహితం చేయాలి. 
 • కొత్తగా చేరిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు, నర్సింగ్‌ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. 
 • ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫీసర్లు, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ నర్సులకు విడతల వారీగా నిమ్స్‌లో శిక్షణ ఇప్పించాలి. శిక్షణ పొందినవారు ఆస్పత్రి స్థాయిలో ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.  
 • అన్ని ఆస్పత్రుల్లో స్టెరిలైజేషన్‌ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా అవసరమైతే వాటిని వెంటనే తెప్పించుకోవాలి. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top