ఆర్నెళ్లలో గురుకుల నియామకాలు!

Telangana: Govt Set Up To Gurukulam Job Notifications Within 6 Months - Sakshi

పోస్టుల భర్తీపై టీఆర్‌ఈఐఆర్‌బీ స్పష్టీకరణ

ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్లు 

10 వేల పోస్టుల భర్తీపై కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆర్నెల్లలో సమయం పడుతుందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వివిధ శాఖల్లో 80వేల పైచిలుకు ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (నేరుగా నియామకాల) పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నిర్దేశించిన పోస్టులను ఎంత కాలంలో భర్తీ చేస్తారనే అంచనాలను ప్రభుత్వం సేకరించింది.

ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోస్టుల భర్తీకి ఎంత సమయం పడుతుందో వివరాలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు నియామక సంస్థలను కోరింది. గురుకులాల్లో 10 వేల ఖాళీలు ఉండగా, వీటి భర్తీకి ఆర్నెల్ల వ్యవధి పడుతుందని టీఆర్‌ఈఐఆర్‌బీ వెల్లడించింది. ఈ 10 వేల ఖాళీల్లో 85 శాతం పోస్టులు బోధన కేటగిరీవి కాగా, మిగతావి బోధనేతర కేటగిరీలోనివి. ప్రస్తుతం ఈ పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ భర్తీకి సంబంధించి శాఖల వారీగా ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే నియామకాల ప్రక్రియను వేగవంతం చేసి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది.

వివాదరహితంగా రిక్రూట్‌మెంట్‌
రాష్ట్రంలో ఐదు గురుకులాల సొసైటీలుండగా, వీటి పరిధిలో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలను చేపట్టేం దుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్‌ఈఐఆర్‌బీని ఏర్పాటుచేసింది. ఈ బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 7 వేల ఖాళీల భర్తీకి అనుమతులివ్వగా, ఒక్క ఉద్యోగానికి సంబంధించి కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా భర్తీ చేసి శభాష్‌ అనిపించుకుంది. వీటిని గరిష్టంగా 9 నెలల వ్యవధిలోనే పూర్తి చేయగా, ఈసారి మరింత తక్కువ సమయంలోనే నియామకాలు చేపట్టేందుకు బోర్డు సిద్ధమవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top