సాదా బైనామాల 'రాత మారలేదు'.. కోర్టు చెప్పినా పట్టించుకోని తెలంగాణ రెవెన్యూ శాఖ

Telangana Govt Sada Bainama Revenue Department - Sakshi

క్రమబద్ధీకరణకు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూపులు

రాష్ట్రంలో అపరిష్కృతంగా వ్యవసాయ భూములకు హక్కుల కల్పన అంశం 

9.24 లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌ 

2.24 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ 

వీటిపై కూడా దృష్టి సారించని రెవెన్యూ శాఖ 

కోర్టు తీర్పు, కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ముందుకు పడని అడుగులు.. ఆదాయం వచ్చే అంశం కానందునే పట్టించుకోవడం లేదనే విమర్శలు  

సాక్షి, హైదరాబాద్‌: సాదా బైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిగిన గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు హక్కులు కల్పించే అంశం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సాదా బైనామా దరఖాస్తుదారులను ఊరిస్తోందే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. వీటి విషయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయమూ తీసుకోవడం లేదు.

దీంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న 9.24 లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. సాదా బైనామాల అంశం ఇప్పటికే కోర్టులో ఉండగా, కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

2.24 లక్షల దరఖాస్తులకు కోర్టు ఓకే 
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల (రిజిష్ట్రేషన్‌ లేకుండా కేవలం కాగితాలపై రాసుకోవడం) ద్వారా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే ఇలా అమ్మిన, కొన్న భూములపై క్షేత్రస్థాయిలో హక్కులే తప్ప చట్టబద్ధమైన హక్కులు లభించవు. ఈ చట్టబద్ధమైన హక్కుల కల్పన (క్రమబద్ధీకరణ) కోసం 2020లో ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.

అయితే 2020 అక్టోబర్‌ 30 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినందున దరఖాస్తు ప్రక్రియను ఆ ఏడాది నవంబర్‌ 10 వరకు పొడిగించింది. అయితే అక్టోబర్‌ 29లోపు 2.24 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు అంటే 12 రోజుల్లో మరో 7 లక్షల దరఖాస్తుల వరకు వచ్చాయి. కానీ ఈ దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.

కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు.. అంటే 2020 అక్టోబర్‌ 29 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రం పరిశీలించి హక్కులు కల్పించవచ్చని తెలిపింది. అయితే కోర్టు తీసుకునే తుది నిర్ణయం మేరకు వాటి పరిష్కారం పూర్తవుతుందంటూ స్పష్టం చేసింది.  

13–బీ సర్టిఫికెట్‌ జారీకి ఇబ్బందులు 
కోర్టు తీర్పు వచ్చేసరికి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో సాదా బైనామాల పరిష్కారం ఓ ప్రహసనంగా మారిపోయింది. వాస్తవానికి సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి హక్కులు కల్పించడం కోసం 13–బీ సర్టిఫికెట్‌ జారీ చేసే అధికారం పాత రెవెన్యూ చట్టం ప్రకారం తహశీల్దార్లకు ఉండేది. కానీ కొత్త చట్టంలో.. జిల్లాల కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి పరిశీలించి వాటి పరిష్కారానికి సిఫారసు చేస్తేనే తహశీల్దార్లు 13–బీ సర్టిఫికెట్‌ జారీ చేయాలనే నిబంధన చేర్చారు.

కానీ జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి కారణంగా గ్రామాలకు వెళ్లి సాదా బైనామాలను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెవెన్యూ శాఖ ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అయితే సాదా బైనామాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదని, 5 ఎకరాల లోపు లావాదేవీలకు కనీసం స్టాంపు డ్యూటీ కూడా వసూలు చేయవద్దని పేర్కొంటూ కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేసినందునే ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం.  

పరిష్కారానికి రెండు మార్గాలు! 
సాదా బైనామాల అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రంలోని 9.24 లక్షల మంది దరఖాస్తుదారులు కోరుతున్న నేపథ్యంలో.. ఇందుకు రెండు మార్గాలున్నాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్‌ 29లోపు వచ్చిన 2.4 లక్షల దరఖాస్తులను పరిష్కరించవచ్చని హైకోర్టు చెప్పినందున, పాత చట్టం ప్రకారం ఫీజు కట్టించుకుని తహశీల్దార్ల ద్వారా క్రమబద్ధీకరణ కోసం 13–బీ సర్టిఫికెట్‌ జారీ చేయించవచ్చని అంటున్నారు.

ఇక అక్టోబర్‌ 29 తర్వాత వచ్చిన 7 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలంటే మాత్రం కొత్త చట్టంలోని కలెక్టర్ల సిఫారసు నిబంధనను మార్చాలని, ఇందుకోసం ఆర్డినెన్స్‌ లేదంటే అసెంబ్లీలో చట్ట సవరణ తేవాలని చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సాదా బైనామాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ కోణంలో ఆలోచించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top