సాక్షి,హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంయుక్తంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు, సంక్షేమ హామీలను ప్రకటించారు.
సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లోంచి 34 శాతాన్ని కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ దసరా పండుగను పురస్కరించుకుని ఒక్కో శాశ్వత కార్మికుడికి రూ.1,53,903 చొప్పున బోనస్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5,500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ దరఖాస్తులను రాబోయే 15 రోజుల్లోగా పూర్తిగా క్లియర్ చేస్తాం.మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు ఇంతకాలం కొత్తగూడెం వెళ్లాల్సిన ఇబ్బంది ఉండేది.ఇకపై ఆ అవసరం లేకుండా కార్మికులు పనిచేస్తున్న ఆయా ఏరియా ఆసుపత్రుల్లోనే ఆ సౌకర్యం కల్పిస్తున్నాం.
కరోనా సమయంలో తగిన సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారనే కారణంతో గతంలో సస్పెండ్ అయిన కార్మికులందరికీ తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు, మైనింగ్ జరగని భూముల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా హౌసింగ్ కాలనీలను నిర్మిస్తాం. సింగరేణి ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
సింగరేణి ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సత్తుపల్లి, భూపాలపల్లి జూనియర్ కాలేజీల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను సింగరేణినే సమకూరుస్తుంది. సింగరేణి కార్మికులకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న సంస్థ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


