Fever Hospital Hyderabad: కోవిడ్‌ సేవలకు ఫీవర్‌ ఆస్పత్రి

Telangana Govt Plan Nallakunta Fever Hospital Turn To Covid Hospital - Sakshi

సన్నాహాలు చేస్తున్న అధికారులు 

మరో 200 ఆక్సిజన్‌ బెడ్ల ఏర్పాటుకు చర్యలు 

ఆక్సిజన్‌ ఇన్‌చార్జిగా ఐఏఎస్‌ అధికారి నియామకం

నల్లకుంట: కోవిడ్‌ వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించింది. ఆ అధికారి ఆదేశాలతో కోవిడ్‌ రోగులకు అవసరమైన అదనపు ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 136 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా మరో 200 పడకలను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చే చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో ఉన్న 330 పడకలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ పడకలుగా మారుస్తున్నారు.

ఇప్పటి వరకు 100 పడకలకు త్రీ లైన్‌ ఆక్సిజన్, 36 పడకలకు సింగిల్‌ లైన్‌ ఆక్సిజన్‌ సరఫరా ఉంది. అలాగే మరో 20 ఐసీయూ వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి ఆవరణలో 6 కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉంది. దీని ద్వారానే వార్డుల్లోని అన్ని పడకలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలోని 2,3,4 వార్డులను పూర్తిస్థాయి ఆక్సిజన్‌ పడకలుగా మార్చారు. మరోవారం రోజుల్లో 1,6,7, 8 వార్డుల్లో ఉన్న పడకలకు కూడా సింగిల్‌ లైన్‌ ఆక్సిజన్‌ పడకలుగా మార్చనున్నారు. 

పనుల పరిశీలన 
ఈ పనులను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ అధికారి శివలింగయ్య మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌తో కలిసి ముందుగా అక్కడి ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీవర్‌ ఆస్పత్రిని కూడా పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పలువురు కోవిడ్‌ రోగులు ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని మందులు, ఇంజెక్షన్లు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మరో వారం రోజుల్లో అన్ని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మారుస్తామని తెలిపారు. ఆస్పత్రిలో కోవిడ్‌ ఓపీ క్లినిక్‌ కూడా ఉందని, కోవిడ్‌ అనుమానితులు, బాధితులకు ఈ క్లినిక్‌లో చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎల్‌ఈడీ లైట్లు, పోలీస్‌ ఔట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు. ఆస్పత్రి సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ జయలక్ష్మి, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఫీవర్‌ను పూర్తి స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చితే సాధారణ రోగుల చికిత్సలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top