అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ

Telangana Government Take Care For Orphan Childrens - Sakshi

వారి సంరక్షణ కోసం సంపూర్ణ, సమగ్ర కొత్త విధానం 

దేశం గర్వించేలా, రాష్ట్రాలన్నీ అనుసరించేలా పాలసీకి రూపకల్పన 

కేబినెట్‌ సబ్‌ కమిటీ స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనాథలకు తల్లి, తండ్రిగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర కేబినెట్‌ సబ్‌ కమిటీ తెలిపింది. అనాథల సంరక్షణ కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అనాధల సంరక్షణ నిమిత్తం ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మొదటిసారి సమావేశమైంది.

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనాథల సంక్షేమాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధం ఉందని, ఈ నేపథ్యంలో సబ్‌ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఇతర రాష్టాలన్నీ అనుసరించే విధంగా సూచనలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, అనాథల కోసం రూపొందించే విధానం కూడా వీటన్నింటినీ మించి ఉంటుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

కుటుంబంగా స్థిరపడే వరకు బాధ్యత 
అనాథలుగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి తల్లిదండ్రులుగా మారి, కుటుంబంగా స్థిరపడేవరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకునేలా కొత్త విధానం ప్రతిపాదిస్తామని సభ్యులు చెప్పారు. పాత చట్టాలకు మార్పులు, సవరణలు కాకుండా సంపూర్ణ, సమగ్ర కొత్త విధానం , కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్‌ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్‌లు, ఆశ్రమాలను పటిష్టంగా తయారు చేసేలా, ప్రైవేట్‌ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించేలా ఈ కమిటీ సూచనలు సమర్పిస్తుందని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top