
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..
సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి.సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా.ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది.
తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి.
నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే.
పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్‌గా ఉంటా. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే నా ధ్యేయం’ అని వ్యాఖ్యానించారు.