Telangana Govt Focus on Sale of Lands in Gandipet, Kokapet - Sakshi
Sakshi News home page

Hyderabad: భూం ధాం!.. లక్ష గజాలు.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం

Published Thu, Dec 22 2022 9:00 AM

Telangana Gov Focus On Sale Of lands To Getting Money Gandipet Kokape - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్‌ ప్రాంతాల్లో భూములను విక్రయించి, రూ.కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి శివారు జిల్లాలను ఎంచుకుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో  25.01 ఎకరాల భూములను విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం 1,21,060 చదరపు గజాల వేలంతో సుమారు రూ.15 వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అత్యధికంగా రంగారెడ్డిలో 11.3 ఎకరాలలో 54,692 గజాలను వేలం వేయనుంది. వీటిలో కోకాపేట, గండిపేట, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి హాట్‌ లొకేషన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి కొత్తగా వరంగల్‌ జాతీయ రహదారిలోనూ ప్రభుత్వ స్థలాలను వేలంలో పెట్టింది.. ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో 2662 చదరపు గజాలను వేలం వేయనుంది. కుత్బుల్లాపూర్‌ మండలంలోని సూరారం, బౌరంపేట ప్రాంతాల్లోనూ స్థలాలను అమ్మనుంది.

ఈసారి భూముల వేలం జాబితాలో వాలంతరీ, వీడీఓ, టూరిజం భూములు కూడా ఉండడం విశేషం, గతంలో ఈ భూములను ఐటీ హబ్‌కు కేటాయించాలని నిర్ణయించిన సర్కారు..తాజాగా వేలంలో పెట్టడం గమనార్హం. వేలంలో అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో బౌరంపేటలో 302 గజాలు, అత్యధికంగా పుప్పాలగూడలో 9,680 గజాల స్థలాన్ని వేలం వేయనున్నారు. తాజా వేలంలో 2 వేల గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 16న రిజి్రస్టేషన్‌కు ఆఖరు గడు వు, 18న వేలం ఉంటుందని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రకటించింది. 
చదవండి: తగ్గిన స్థిరాస్తి లావాదేవీలు..!.. పెరిగిన ధరలు...రిజిస్ట్రేషన్‌ చార్జీలు 

మార్కెట్‌ రేటు రెండింతలు.. 
వేలంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మార్కెట్‌ రేటు రెట్టింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంచనా వేసిన రూ.15 వేల కోట్ల ఆదాయ సమీకరణ సులువు అవుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల వంటి ఐటీ, సంపన్నులుండే ప్రాంతంలో స్థలాల వేలం ఉండటంతో స్థానిక డెవలపర్లతో పాటు ఇతర రాష్ట్ర కంపెనీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతంలో గజానికి రూ.60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా.. ప్రస్తుతం మార్కెట్‌ విలువ అక్కడ సుమారు రూ.లక్షపైనే పలుకుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంలో కోకాపేట, ఖానామెట్‌లో భూములను వేలం వేసినప్పుడు గజం రూ.1.50 లక్షలు పలకడంతో.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రారంభ ధరే రూ.1.50 లక్షలుగా నిర్ధారించారని ఓ డెవలపర్‌ తెలిపారు. కోకాపేట కంటే నల్లగండ్లలో నిర్ధారించిన ధర ఎక్కువగా ఉందంటే ఆయా ప్రాంతం వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఘట్‌కేసర్‌ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దేశించగా.. ఆయా ప్రాంతంలో అభివృద్ధి నేపథ్యంలో ఈ ధర ఎంతవరకు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది.  

Advertisement
Advertisement