
రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సంఖ్య వెల్లడి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. 2019 ఎన్నికలతో పోల్చితే తగ్గిన స్థానాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్‌లు 31, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్‌లు 566, ఎంపీటీసీ స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు 1,12,694 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
అప్పుడు 32 జెడ్పీపీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 చొప్పున, ఎంపీటీసీలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848 ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు 1 జెడ్పీపీ, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీలు, 44 ఎంపీటీసీ స్థానాలు, 70 గ్రామపంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఈ గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. దీనివల్లే ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గింది.

మరికొన్ని జిల్లాల్లోనూ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడం, ఇతర కారణాలతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. సంఖ్యాపరంగా చూస్తే...నల్లగొండ జిల్లా 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక ములుగు జిల్లా 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలతో అత్యల్ప స్థానాలున్న జిల్లాగా నిలిచింది.
టాప్–5, లాస్ట్–5 జిల్లాల్లోని స్థానాలు ఇలా..
టాప్–5 జిల్లాలు...
నల్లగొండ: 1 జడ్పీ, 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలు
నిజామాబాద్: 1 జడ్పీ, 31 జడ్పీటీసీలు, 31 ఎంపీపీలు, 307 ఎంపీటీసీ స్థానాలు
ఖమ్మం: 1 జడ్పీ, 20 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీ స్థానాలు
సంగారెడ్డి: 1 జడ్పీ, 26 జడ్పీటీసీలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీ స్థానాలు
సూర్యాపేట: 1 జడ్పీ, 23 జడ్పీటీసీలు, 23 ఎంపీపీలు, 235 ఎంపీటీసీ స్థానాలు
లాస్ట్–5 జిల్లాలు...
ములుగు: 1 జడ్పీ, 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలు
వరంగల్: 1 జడ్పీ, 11 జడ్పీటీసీలు, 11 ఎంపీపీలు, 130 ఎంపీటీసీ స్థానాలు
రాజన్న సిరిసిల్ల: 1 జడ్పీ, 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలు
వనపర్తి: 1 జడ్పీ, 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 133 ఎంపీటీసీ స్థానాలు
మంచిర్యాల: 1 జడ్పీ, 16 జడ్పీటీసీలు, 16 ఎంపీపీలు, 129 ఎంపీటీసీ స్థానాలు