జూన్‌ 2 నుంచి 22 వరకు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

Telangana Formation Decade Festival From June 2 To June 22 - Sakshi

ఉత్సవాల షెడ్యూల్‌ను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఖరారు చేశారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. జూన్‌ 2న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, జూన్‌ 3 నుంచి ఒక్కోరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేలా షెడ్యూల్‌ రూపొందించారు. 

ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌...  
జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు వంటి కార్యక్రమాలుంటాయి.  

► జూన్‌ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం’గా జరుపుతారు. రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాల విశిష్టతను తెలియజేసేలా కార్య క్రమాలుంటాయి. రైతులందరితో కలిసి ప్రజా ప్రతినిధులు, అధికారులు భోజనాలు చేస్తారు.  

► జూన్‌ 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యక్రమాలుంటాయి.  

► జూన్‌ 5వ తేదీన ‘తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవం’జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబరాలు సైతం జరుపుతారు.  

► జూన్‌ 6న ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’జరుగుతుంది. ఈ రోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో ప్రగతిని వివరిస్తారు.  

► జూన్‌ 7న ‘సాగునీటి దినోత్సవం’నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే సమావేశానికి సీఎం హాజరవుతారు.  

► జూన్‌ 8న ‘ఊరూరా చెరువుల పండుగ’నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. కవి గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువు మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారులు వలల ఊరేగింపులు నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు, చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. 

► జూన్‌ 9న ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’పేరుతో ఉత్సవాలు ఉంటాయి. నియోజకవర్గాల వారీ ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. సంక్షేమంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రవీంద్రభారతిలో సభ ఉంటుంది.  

► జూన్‌ 10న ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’నిర్వహిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పాలన సంస్కరణలతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు చేరువ చేయడం, దానివల్ల కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయి. 

► జూన్‌ 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ఉంటుంది. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, రాష్ట్ర ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తారు. 

► జూన్‌ 12న ‘తెలంగాణ రన్‌’ఉంటుంది. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. 

► జూన్‌ 13న ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’నిర్వహిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.  

► జూన్‌ 14వ తేదీన ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం’జరుపుతారు. ప్రభుత్వం వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్‌ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. 

► జూన్‌ 15న ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’జరుపుతారు. పల్లెలు సాధించిన ప్రగతిని తెలి పే పలు కార్యక్రమాలుంటాయి. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.  

► జూన్‌ 16న ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని,ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.  

► జూన్‌ 17న ‘తెలంగాణ గిరిజన దినోత్సవం’జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. 

► జూన్‌ 18న ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.  

► జూన్‌ 19వ తేదీన ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి జరిగిన కృషిని, అడవులు పెరిగిన తీరును వివరిస్తారు. 

► జూన్‌ 20న ‘తెలంగాణ విద్యాదినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సభలు నిర్వహించి, విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. నిర్మాణాలు పూర్తయిన ‘మన ఊరు– మన బడి’పాఠశాలలను ప్రారంభిస్తారు. సిద్ధంగా ఉన్న 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.  

► జూన్‌ 21న ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చి లు, ఇతర ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలు ఉంటాయి.  

► జూన్‌ 22వ తేదీ గురువారం ‘అమరుల సంస్మరణ’కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలతో పాటు విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top