6 లక్షల ఎకరాల్లో అక్రమ హెచ్‌టీబీటీ! | Telangana Faces Concern as Illegal GM Cotton Cultivation Reaches 30 Percent | Sakshi
Sakshi News home page

6 లక్షల ఎకరాల్లో అక్రమ హెచ్‌టీబీటీ!

Oct 10 2026 5:00 AM | Updated on Oct 10 2026 5:00 AM

Telangana Faces Concern as Illegal GM Cotton Cultivation Reaches 30 Percent

రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ స్థాయిలో పత్తి సాగు

అనుమతిలేకున్నా యథేచ్ఛగా వంగడాల వినియోగం

కూలీల కొరత, కలుపు ఖర్చులే ప్రధాన కారణాలు

విత్తనాల బ్లాక్‌ మార్కెట్‌పై జరిగిన అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణంలో 27–30 శాతం వరకు అనుమతిలేని జన్యుమార్పిడి పత్తి వంగడాలు సాగవుతున్నట్లు తేలింది. 2025–26 పత్తి సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 5.5–6.1 లక్షల హెక్టార్లలో హెచ్‌టీబీటీ (హెర్బిసైడ్‌ టాలరెంట్‌ బీటీ) పత్తి సాగైనట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంది. దేశవ్యాప్తంగా 26.2–29 లక్షల హెక్టార్లలో ఈ రకం పత్తి సాగవుతోందని వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 24–30 శాతానికి సమానమని తెలిపింది. 

విత్తన పరిశ్రమకు చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్‌ సీడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఏఐ) సహకారంతో సౌత్‌ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. రైతుల నుంచి సేకరించిన సమాచారం, విత్తన సరఫరా వ్యవస్థ పరిశీలన, పత్తి నమూనాల ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ అంచనా లను రూపొందించింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో అధ్యయనం చేపట్టారు. హెచ్‌టీబీటీ పత్తి వంగడాల వైపు రైతులు మొగ్గుచూపడానికి కూలీల కొరత, కలుపు తీయడానికి పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణాలని అధ్యయనం 
పేర్కొంది.

ఈ వంగడాల్లో ఉండే సీపీ4– ఈపీఎస్‌పీఎస్‌ జన్యువు వల్ల పత్తి మొక్కలు గ్లైఫోసేట్‌ ఆధారిత కలుపుమందును తట్టుకోగలవు. దీంతో పత్తి మొక్కలకు పెద్దగా హాని కలగకుండా కలుపును నియంత్రించవచ్చన్నది ఈ సాంకేతికత వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఒక ఎకరంలో చేతితో కలుపు తీయడానికి రూ.12,000–15,000 వరకు ఖర్చవుతుండగా, గ్లైఫోసేట్‌ ఆధారిత కలుపు నియంత్రణకు రూ.750–850 మాత్రమే ఖర్చవుతోంది. ఈ వ్యయ వ్యత్యాసం, కూలీల లభ్యత తగ్గడం రైతులను అనధికారిక విత్తనాల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక విశ్లేషించింది.

మరోవైపు భారత్‌లో హెర్బిసైడ్‌ టాలరెంట్‌ బీటీ పత్తి (హెచ్‌టీబీటీ) వాణిజ్య సాగుకు ఇప్పటివరకు అనుమతి లేదు. పర్యావరణం, భూసారం భారీ ఎత్తున దెబ్బతినే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గతంలోనూ అనుమతి లేని హెచ్‌టీ పత్తి విత్తనాల విక్రయాలు, సాగును అరికట్టేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. 2025–26లో దేశంలో అనుమతి లేని హెచ్‌టీబీటీ విత్తనాల అనధికారిక మార్కెట్‌ విలువను రూ.820–880 కోట్లుగా అంచనా వేశారు. మరోవైపు, విత్తన పరిశ్రమ సంఘాలు ఈ సాంకేతికతకు అనుమతులు ఇవ్వడం ద్వారా రైతులకు మెరుగైన కలుపు నియంత్రణ సాంకేతికత అందించవచ్చని వాదిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, తెలంగాణతోపాటు ప్రధాన పత్తి సాగు రాష్ట్రాల్లో అనుమతి లేని జన్యుమార్పిడి వంగడాల వినియోగం విస్తరిస్తున్నట్లు అధ్యయనం సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement