ఇంజనీరింగ్‌ ఫీజు పెంపు ఖాయం!

Telangana: Engineering Colleges Likely To Hike Fees 2022 - Sakshi

కనిష్టంగా రూ.45 వేలు.. గరిష్టంగా 1.60 లక్షలపైనే.. 

ఎఫ్‌ఆర్‌సీ దగ్గర ప్రైవేటు కాలేజీల పట్టు

వినకపోతే కాలేజీలు నడపలేమనే వాదన.. కొనసాగుతున్న సంప్రదింపులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజు పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. తమ జమా ఖర్చులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రవే శాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు వాదన వినిపిస్తున్నాయి. హైకోర్టు సూచన మేరకు ఫీజుల నిర్ధారణపై ప్రైవేటు కాలేజీల మూడేళ్ల ఖర్చును సోమవారం నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టింది.

దాదాపు 19 కాలేజీలు ఫీజుల పెంపును కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాయి. తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, వారి జమా ఖర్చులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌ఆర్‌సీకి సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి ప్రతీ మూడేళ్లకోసారి ఎఫ్‌ ఆర్‌సీ ఇంజనీరింగ్‌ ఫీజులను సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 

లాక్‌డౌన్‌ ఉన్నా ఖర్చులు పెరిగాయా?
2023లో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు కోసం కాలేజీలు ఆరునెలల క్రితమే ఆడిట్‌ నివేదికలు సమర్పించాయి. గత మూడేళ్లుగా కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా కారణంగా కాలేజీలు సరిగా నడవకపోయినా, కొన్ని కాలేజీలు భారీగానే వ్యయం చేసినట్టు లెక్కలు చూపించాయి. సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రత్యేక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించామనే వాదనను తెరమీదకు తెచ్చాయి.

కొన్ని కాలేజీలు న్యాయ సంబంధమైన లావాదేవీలకు అయిన ఖర్చును కూడా లెక్కల్లో చూపించాయి. వీటన్నింటిపైనా ఎఫ్‌ఆర్‌సీ కొన్నినెలల క్రితమే అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించి వాస్తవ ఖర్చుతో పెంపును నిర్ధారించింది. అయితే, ఇదే సమయంలో విద్యార్థులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని ప్రభుత్వానికి ఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఎఫ్‌ఆర్‌సీ అంగీకరించిన ఫీజునే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

కావాలంటే కాస్త్త తగ్గిస్తాం...
ఎఫ్‌ఆర్‌సీ దగ్గర జరిగిన సంప్రదింపుల్లో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు కొంత తగ్గినట్టు తెలిసింది. రూ. 1.73 లక్షలు డిమాండ్‌ చేస్తున్న కాలేజీ రూ.10 వేలు తగ్గించుకునేందుకు, రూ.1.50 పైన ఫీజులు డిమాండ్‌ చేసే కాలేజీలు రూ. 5 వేలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీన్నిబట్టి కనిష్ట ఫీజు రూ 45 వేలు, గరిష్ట ఫీజు రూ.1.63 లక్షల వరకూ ఉండొచ్చని కాలేజీలు భావిస్తున్నాయి.

అయితే ఈ వాదనను మాత్రం ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు అంగీకరించడం లేదు. కాలేజీలు సమర్పించిన ఆడిట్‌ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని, ఏమేర ఫీజులను నిర్ధారించాలనే దిశగా అడుగులు వేస్తున్నామని ఎఫ్‌ఆర్‌సీకి చెందిన ఓ అధికారి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top