Telangana: 27 నుంచి ‘దళితబంధు’ సర్వే | Telangana Dalit Enumeration In Huzurabad From Aug 27 | Sakshi
Sakshi News home page

Telangana: 27 నుంచి ‘దళితబంధు’ సర్వే

Aug 26 2021 4:09 AM | Updated on Aug 26 2021 4:11 AM

Telangana Dalit Enumeration In Huzurabad From Aug 27 - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కర్ణన్‌. చిత్రంలో రాహుల్‌బొజ్జా, హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నెల 27 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సర్వే మొదలుకానుంది. ఇందుకోసం 400 మంది జిల్లా, మండలస్థాయి అధికారులు పనిచేస్తారని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు. అంతకముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దళితబంధు సర్వేకు అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం వివరాలను సీఎంవో కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌తో కలసి కలెక్టర్‌ కర్ణన్‌ విలేకరులకు వెల్లడించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలు, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ మండలంతో కలిపి మొత్తం ఏడు యూనిట్లుగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ముగ్గురు నుంచి ఐదుగురు జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సర్వే సెప్టెంబర్‌ 2 లేదా 3వ తేదీకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రతి కుటుంబానికి దళితబంధు పేరిట కొత్త ఖాతాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 15 మందికి ప్రత్యేక కొత్త ఖాతాలు ఇచ్చి రూ.10 లక్షల నగదు బదిలీ చేశామని వెల్లడించారు. ఇప్పటికే కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాలో మొత్తం రూ.1,500 కోట్లు వచ్చి చేరాయన్నారు. 

దళితులందరికీ ఇస్తాం: రాహుల్‌ బొజ్జా 
సమగ్ర కుటుంబ సర్వే, సంక్షేమ పథకాల జాబితా ఆధారంగా దళిత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా అన్నారు. రైతుబంధుకు ప్రతి రైతు అర్హుడైనట్లే, జిల్లాలో దళితులంతా దళితబంధుకు అర్హులే అని తెలిపారు. కేవలం యూనిట్‌ పెట్టించడమే కాదు, వారికి కావాల్సిన లైసెన్సింగ్, మార్కెటింగ్, పర్యవేక్షణ, సలహాలు, సూచనలు ఇస్తామని, చాలా దళిత కుటుంబాలు డెయిరీరంగంపై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement