కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది

Telangana Congress Leaders Comments On Modi Government - Sakshi

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

సంగారెడ్డిలో కాంగ్రెస్‌ నేతలు మీడియా సమావేశం

సాక్షి, సంగారెడ్డి: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి నిరసన వ్యక్తం అవుతోందని ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని.. మోదీ ప్రభుత్వ  రైతు వ్యతిరేక బిల్లులపై రేపు(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త నిరసనలు చేపట్టామని తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా  తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రేపు సంగారెడ్డిలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర  వ్యవహారాల ఇంచార్జ్  మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

రైతు వ్యతిరేక బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్ష మద్దతు..
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నట్లు కనబడుతోందని ఆరోపించారు. మొదటి నుండి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం  మద్దతు పలుకుతోందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ  రైతు వ్యతిరేక బిల్లు అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష మద్దతు ఉందన్నారు. రెండు రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారని, తప్పక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీ సంఖ్యలో తరలిరావాలి..
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రేపు(శుక్రవారం) సంగారెడ్డి గంజి మైదానంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్‌ ర్యాలీ, సంతకాల సేకరణ ఉంటుందన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు..
కాంగ్రెస్‌ నేత కుసుమ్‌ కుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీవ్ర రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. రైతులను నిండా ముంచుతూ కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా రేపు(శుక్రవారం) గాంధీజీ, శాస్త్రి జయంతి మొదలుకుని అక్టోబర్ 31 వరకు  నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top