యాదాద్రి విద్యుత్‌ కేంద్రానికి సీఎం కేసీఆర్‌ 

Telangana CM KCR To Visit Yadadri Thermal Power Plant In Damaracherla - Sakshi

పనులను పరిశీలించనున్న సీఎం  

సాక్షి, హైదరాబాద్‌/దామరచర్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి ఐదు యూనిట్లలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సుమారు 6 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్ల అంచనాతో దీని పనులు చేపట్టగా, రూ.18,443 కోట్ల వ్యయంతో 65శాతం పనులు పూర్తయ్యాయి.

50శాతం విదేశీ బొగ్గు, 50శాతం స్వదేశీ బొగ్గు మిశ్రమంతో విద్యుదుత్పత్తి చేస్తామన్న ప్రతిపాదనలతో జెన్‌కో ఈ విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతులు పొందింది. దీనికి భిన్నంగా 100శాతం స్వదేశీ బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నందున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

దేశీయ బొగ్గుతో కలిగే పర్యావరణ ప్రభావంపై కొత్తగా అధ్యయనం జరిపి మళ్లీ పర్యావరణ అనుమతులను పొందాలని ఆదేశించింది. మళ్లీ అధ్యయనం జరిపేందుకు అనుసరించాల్సిన నిబంధనలను ఇటీవల కేంద్ర పర్యావరణ శా­ఖ నిపుణుల కమిటీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. 

సీఎం పర్యటన ఇలా... 
సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్ల మండంలోని వీర్లపాలెం చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు కేసీఆర్‌ తిరుగు పయనమవుతారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top