Telangana Cabinet Meeting: కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివీ.. | Sakshi
Sakshi News home page

Telangana Cabinet Meeting: కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివీ..

Published Tue, Aug 1 2023 3:15 AM

Telangana: Cabinet decides to merge TSRTC with government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఆర్‌అండ్‌బీ, రవాణా, కార్మిక, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వివిధ పనులు, కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది.

వరద మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమైంది. సుమారు 50కిపైగా అంశాలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సహచర మంత్రులతో కలసి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రవాణా, ఆర్థిక శాఖల మంత్రులు, ఆర్టీసీ చైర్మన్‌తోపాటు కార్మికుల నుంచి వచి్చన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఆరీ్టసీని కాపాడేందుకు, ప్రజారవాణాను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. 

వరద తక్షణ సాయంగా రూ.500 కోట్లు 
రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిందని కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ/ పంచాయతీరాజ్‌ రోడ్లు, చెరువులు, కాల్వలు, పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆదేశించినట్టు వివరించారు.

ఇక వివిధ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు తరలించిన 27వేల మంది ముంపు బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు. వరదల్లో మృతిచెందిన 40 మందికిపైగా వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదలతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఇతర సమస్యలపై సమగ్రమైన నివేదిక అందించాలని కలెక్టర్లను కేబినెట్‌ ఆదేశించిందని.. రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించిందని వివరించారు. ఖమ్మం పొడవునా ప్రవహిస్తున్న మున్నేరువాగు వరద నుంచి పట్టణానికి రక్షణకోసం వరద గోడలు నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

వారి సేవలు భేష్‌.. 
వరద ముప్పును సైతం లెక్కచేయకుండా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కోసం ధైర్య సాహసాలతో విధులు నిర్వహించిన విద్యుత్‌ శాఖ లైన్‌మన్, హెల్పర్‌తోపాటు ముందుచూపుతో 40మంది విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుడు మీనయ్యను ఈ పంద్రాగస్టు సందర్భంగా సన్మానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారి సేవలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రస్తావించి కొనియాడారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

అనాథల కోసం ప్రత్యేక పాలసీ 
రాష్ట్రంలోని అనాథ పిల్లలను ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ది స్టేట్‌’గా గుర్తిస్తూ.. వారి సంరక్షణ, ఆలనా పాలన చూసుకోవడానికి పకడ్బందీగా ‘అనాథ బాలల పాలసీ’ని రూపొందించాలని శిశుసంక్షేమ శాఖను కేబినెట్‌ ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు తల్లిదండ్రులుగా నిలుస్తుందని.. ఆశ్రయం క ల్పిం చి, ప్రయోజకులుగా మార్చి, వారికంటూ ఓ కుటుంబం ఉన్నట్టుగా సంరక్షిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

కేబినెట్‌ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలివీ..

  • రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్‌ ఇవ్వాలని కార్మిక శాఖను కేబినెట్‌ ఆదేశించింది. 
  • వరంగల్‌లోని మామునూరులో విమానాశ్ర యం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కోరిన మేరకు 253 ఎకరాల భూమి ని సేకరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. బీదర్‌ తరహాలో ఇక్కడ విమానాశ్రయం నిర్వహించాలని, ఇకపై కుంటిసాకులు చెప్పవద్దని అథారిటీకి మంత్రి కేటీఆర్‌ సూచించారు.
  • శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. ఇతర నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ రెండో ఎయిర్‌పోర్టు అవసరమని మంత్రివర్గం అభిప్రాయపడింది. పుణె, గోవాలలో రక్షణ రంగ విమానాశ్రయాలను పౌర విమానాశ్రయాలుగా విని యోగిస్తున్న తరహాలోనే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమానయాన సేవలకు వినియో గించాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రక్షణ, పౌరవిమానయాన శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 
  • దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ వంటి కాపు అనుబంధ కులాల కోసం ‘సౌత్‌ ఇండియా సెంటర్‌ ఫర్‌ కాపు కమ్యూనిటీ’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 
  • రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయం సాకారమైందని కేటీఆర్‌ చెప్పారు. 
  • మహబూబాద్‌ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్‌ క ళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వరదల్లో చనిపోయినవారిలో రైతు బీమా ఉన్న వారికి రూ.5 లక్షల సొమ్ము ఆటోమెటిగ్గా వస్తుందని, మరో రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement