లోక్‌ భవన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు | Telangana: Bathukamma Celebrations At Lok Bhavan | Sakshi
Sakshi News home page

లోక్‌ భవన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

Oct 15 2026 9:32 PM | Updated on Oct 15 2026 9:32 PM

Telangana: Bathukamma Celebrations At Lok Bhavan

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, స్త్రీశక్తికి, సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల్లో ప్రకృతి పట్ల ఆరాధనాభావాన్ని, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. పుష్పాలనే దైవ స్వరూపంగా భావించి పూజించే ప్రకృతి ఉత్సవం బతుకమ్మ పండుగ అని గవర్నర్ పేర్కొన్నారు.

గురువారం లోక్‌భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి పాల్గొని, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. పూలతో అలంకరించిన బతుకమ్మ ప్రకృతి సౌందర్యానికి, జీవన వైభవానికి, మానవాళికి ప్రకృతితో ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతిబింబమని అన్నారు. ప్రకృతిని పరిరక్షించడం, సహజ వనరులను గౌరవించడం, పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి విలువలను ఈ పండుగ చాటిచెబుతుందని తెలిపారు.

బతుకమ్మ మహిళల సృజనాత్మకతకు, ఆత్మగౌరవానికి, సామాజిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జానపద గీతాలు, కళలు, సంప్రదాయ ఆచారాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సజీవంగా నిలుపుతున్న మహిళల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించి, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రకృతి పరిరక్షణ, మహిళా సాధికారత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సామాజిక సామరస్యానికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ పురోగతి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement