Plastic Ban In Telangana: జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం

Telangana: Ban On Single Use Plastic From July 1 - Sakshi

అమలుకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి ఇంద్రకరణ్‌

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌(ఎస్‌యూపీ) ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీపీసీబీ) చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఎస్‌యూపీ సరఫరా ముడి సరుకులు, ప్లాస్టిక్‌ డిమాండ్‌ తగ్గింపునకు చర్యలు, ఈ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన వంటివి చేపడతామన్నారు. వీటితోపాటు పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పాలనాయంత్రాంగానికి అవగాహన కల్పన, మార్గనిర్దేశానికి ఈ ప్రణాళికలో భాగంగా పీసీబీ బహుముఖ విధానాన్ని అవలంబిస్తోందన్నారు.

ఎస్‌యూపీలపై నిషేధం అమలుకు, ప్రత్యామ్నాయ వస్తువుల ప్రోత్సాహానికి కంపోస్టబుల్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్‌ టైం సర్టిఫికెట్లు జారీ చేస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌–టెక్నాలజీ (సిపెట్‌), జాతీయ ఎమ్మెస్‌ఎంఈ శిక్షణ సంస్థ, ప్లాస్టిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ల సహకారంతో ఎస్‌యూపీలకు బదులుగా ఎమ్మెఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ టీపీసీబీ వర్క్‌షాపులను నిర్వహిస్తుందన్నారు.

నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేయడానికి సీపీసీబీ ఎస్‌యూపీ–సీపీసీబీ ప్రత్యేక ఆన్‌లైన్‌ యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎస్‌యూపీ వస్తువుల వినియోగానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని సూచించారు.

నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్‌ వస్తువులు ఇవే
ఇయర్‌ బడ్స్‌(ప్లాస్టిక్‌ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ (ప్లాస్టిక్‌ పుల్లలతో), ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్‌–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు(ప్లాస్టిక్‌ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్‌ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్‌ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్‌ ఆహ్వానపత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్‌).   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top