148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం | Telangana approved Rs 148 crore for Bridge Approach Roads | Sakshi
Sakshi News home page

148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం

Apr 22 2026 9:14 PM | Updated on Apr 22 2026 9:14 PM

Telangana approved Rs 148 crore for Bridge Approach Roads

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్ఫ్రా స్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆమోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జూన్ 8 లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం , నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని  తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement