‘తీజ్‌ పండుగ’: ఉత్సాహంగా బంజారాల బతుకమ్మ వేడుకలు

Teej Festival 2021: Celebrations Begins In Adilabad DIstrict - Sakshi

రాఖీపౌర్ణమితో షురూ.. కృష్ణాష్టమితో ముగింపు

వారం పాటు సాగనున్న ఉత్సవాలు

ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఏటా తీజ్‌ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు గిరిజనులు. ఏటా శ్రావణమాసంలో లంబాడా(బంజారా) తండాల్లో తొమ్మిది రోజులపాటు తీజ్‌ ఉత్సవాలు సందడిగా జరుగుతుంటాయి. ఈసారి తీజ్‌ ఉత్సవాలు రాఖీ పౌర్ణమి పండుగ రోజు(ఆదివారం) ప్రారంభమై శ్రీకృష్ణాష్టమితో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో తీజ్‌ వేడుకలపై సాక్షి కథనం...

సాక్షి, ఉట్నూర్‌/బజార్‌హత్నూర్‌:  పూర్వం సింధు రాజుల కాలం నుండి బంజారాల జీవన విధానంపై అనేక కథనాలు ఉన్నాయి అఖండ భారతావనిలో వందల ఏళ్ళ కాలం నుంచే బంజారాల పండుగలు ప్రత్యేకత కలిగివున్నాయి. బంజారాలు హిందూ రాజులైన పృథ్వీరాజ్‌ చౌహాన్, మహారాణా ప్రతాప్‌ సింగ్‌ వంటివారి దగ్గర వివిధ హోదాల్లో సేవలందించారు. గోర్‌ బంజారాలు వారి కష్టం మీద వారే ఆధార పడుతూ స్వతంత్రంగా జీవించేవారు. నాడు ఏవిధంగానైతే భారతదేశంలో స్వయం పోషక గ్రామాలు వర్ధిల్లాయో, అదేవిధంగా గోర్‌ బంజారా ఆవాసాలు కూడా స్వయంపోషక తండాలుగా వర్ధిల్లాయి.


బుట్టలపై నీళ్లు చల్లుతున్న యువతులు (ఫైల్‌) 

తొమ్మిది రోజులు ఆటపాటలతో..
బంజారాలు సంతానం, పాడి పంటల సౌభాగ్యం కోసం గోర్‌ దేవుళ్లయిన సంత్‌ శ్రీసేవాలాల్‌ మహారాజ్, సీత్లా, మోరామ మాతలతో పాటు తిరుపతి బాలాజీ, హాతీరాం బావాజీ, వేములవాడ రాజన్నని కొలిచేవారు. బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతిని ఆరాధించేవే. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని నమ్ముతారు.

వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్‌’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్‌’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్‌లో నవధాన్యాలను, గోధుమ మొలకలను పూజించడం ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుకొంటారు.

పెళ్లి కాని యువతులకు పండుగ..
తీజ్‌ ఒక ప్రత్యేకమైన పండుగ. బంజారాల బతుకమ్మ తీజ్‌ పండుగ అని చెప్పవచ్చు. బంజారాల సాంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు తండాలో ఎంత మంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు పూటలు నీరు పోస్తారు. ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్‌ బుట్టలను పట్టుకొని తొమ్మిదో రోజున వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు.

తీజ్‌ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. వార్తా, రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఈ పండుగను ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు వారికి వీలైనప్పుడు నిర్వహించేవారు. కానీ చదువు, ఉద్యోగ, వ్యాపార పరంగా సొంత తండాలకు దూరంగా నివసిస్తున్న లంబాడీలు వారి పండుగలను ఒకే కాలంలో నిర్వహిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పండుగను కలిసి నిర్వహించుకోవడమే కాకుండా, ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నారు.   

గోకులాష్టమితో నిమజ్జనం
గోకులాష్టమి రోజున (తొమ్మిదోరోజు) గ్రామపెద్ద నాయక్‌ ఇంటి ఆవరణలో సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం సమీపంలోని వాగులు, చెరువుల్లో వెదురుబుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో సోదరిమణుల ఆశీర్వారం సోదరులు తీసుకుంటారు.

పులియాగెనో తప్పనిసరి..
తీజ్‌ ఉత్సవాల్లో ముఖ్యమైనది పులియాగెనో. దీనిని బంజారా మహిళలు అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేస్తారు. కలశం ద్వారా జలాలను యువతులు ఎత్తుకొచ్చేటప్పుడు తలపైన పెట్టుకునే దాన్ని గెనో, రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అని వ్యవహరిస్తారు. వివాహ సమయంలో పులియాగెనోను తమ కుమార్తెకు తల్లిదండ్రులు బహుమానంగా అందిస్తారు.

- బానోతు లక్ష్మీబాయి పరిశోధక విద్యార్థి (జర్నలిజం శాఖ).
(బంజారాల బతుకమ్మ తీజ్‌ పండుగ సందర్భంగా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top