హైదరాబాద్‌లోనే ఎక్కువ..! సూపర్‌ పవర్‌! | Super power in Future/First City Mirkhanpet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనే ఎక్కువ..! సూపర్‌ పవర్‌!

Dec 14 2024 7:28 AM | Updated on Dec 14 2024 7:28 AM

Super power in Future/First City Mirkhanpet

ఫీడర్లకు సెన్సార్లు.. నిరంతర మానిటరింగ్‌ 

సిటీలో 30, శివారులో 40 శాతం డిమాండ్‌ 

‘సాక్షి’తో సీపీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ  

సాక్షి, సిటీబ్యూరో: ‘మీర్‌ఖాన్‌పేట కేంద్రంగా ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్‌/ఫోర్త్‌సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఫార్మా, ఐటీ అనుబంధ సంస్థలు అనేకం ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని నిర్ణయించాం. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయబోతున్నాం. లైన్లను విస్తరించడంతో పాటు డిమాండ్‌ తట్టుకునే విధంగా కొత్త సబ్‌స్టేషన్లు, అదనపు డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయబోతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..  

ఏటా 30 నుంచి 40 శాతం గ్రోత్‌.. 
సాధారణంగా ప్రతి ఏటా విద్యుత్‌ గ్రోత్‌ రేటు ఏడు శాతం నమోదవుతుంది. కానీ ఈసారి డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. రూరల్‌ ఏరియాలో గ్రోత్‌రేట్‌ ఏడు శాతం ఉంటే, నగరంలో 30 శాతం, నగర శివారు మున్సిపాలిటీల్లో 40 శాతం ఉన్నట్లు గుర్తించాం. భవిష్యత్‌ను డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు 2027లో రావాల్సిన కొత్త సబ్‌ స్టేషన్లను 2025లోనే తీసుకురాబోతున్నాం. 

డిస్కం పరిధిలో మొత్తం 164 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు టెండర్లు పిలిచాం. వీటిలో ఒక్క గ్రేటర్‌ జిల్లాల్లోనే 88 సబ్‌స్టేషన్లు రాబోతున్నాయి. బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 5, హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లో 9, హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో 9, సికింద్రాబాద్‌ సర్కిల్లో 13, రాజేంద్రనగర్‌ సర్కిల్లో 13 చొప్పున, సైబర్‌సిటీ సర్కిల్‌లో 6, సరూర్‌నగర్‌ సర్కిల్‌ 5, వికారాబాద్‌లో 10, మేడ్చల్‌లో 18 చొప్పున కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం.   

ఫీడర్లకు సెన్సార్లు... 
నగరంలోని అన్ని సబ్‌స్టేషన్లకు మల్టిపుల్  ఇన్‌ కమింగ్, అవుట్‌గోయింగ్‌ లైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఔటర్‌ చుట్టూ విద్యుత్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. 400 కేవీ సబ్‌స్టేషన్లు అనుసంధానిస్తున్నాం. నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కోసం జీహెచ్‌ఎంసీ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్ల ఫీడర్లకు సెన్సార్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కరెంట్‌ సరఫరా నిలిచిపోతే.. వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులకు చేరే విధంగా సెంట్రలైజ్డ్‌ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్‌ అంబులెన్స్‌లను కూడా వీటికి అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. మరో మూడు మాసాల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. కనురెప్ప పాటు కూడా కరెంట్‌ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు పీటీఆర్‌ల సామర్థ్యం కూడా పెంచాం. దెబ్బతిన్న డీటీఆర్‌లను మార్చుతున్నాం. సెక్షన్లవారీగా ఎల్సీలు తీసుకుని, లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం.  

మణికొండలోనే అత్యధికం.. 
మణికొండ, అయ్యప్ప సొసైటీల్లో అంచనాలకు మించి విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతోంది. ఇక్కడ ఉన్న భవనాలపై స్పష్టత లేకపోవడంతో డిమాండ్‌పై స్పష్టత కొరవడింది. దీంతో విద్యుత్‌ వినియోగం ఊహకందడం లేదు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా ఉన్న సర్కిళ్ల పరిధిలో అదనపు డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయబోతున్నాం. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు సహా దెబ్బతిన్న డీటీఆర్‌ల స్థానంలో కొత్తవి అమర్చడం వంటి వాటిని గుర్తించి, పునరుద్ధరించడం తదితర పనులు చేపట్టాం. 

అలాగే.. రాజేంద్రనగర్‌లో 160, సైబర్‌ సిటీలో 151, మేడ్చల్‌లో 160, హబ్సిగూడలో 857, బంజారాహిల్స్‌లో 89, సికింద్రాబాద్‌లో 148, హైదరాబాద్‌ సెంట్రల్‌లో 250, హైదరాబాద్‌ సౌత్‌లో 90, సరూర్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 563 అదనపు డీటీఆర్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రమాదాల నివారణ సహా ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణలో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ పోల్స్‌ తొలగింపునకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement