
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో ఎమర్జింగ్ బ్రాంచీలనే ఎంచుకున్న విద్యార్థులు
10 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చే చాన్స్
ముగిసిన ఆప్షన్ల గడువు..18న సీట్ల కేటాయింపు..13న మాక్ సీట్లు
ఖరారైన ఫీజులను ప్రభుత్వం నిలిపేయడంపై కోర్టుకెక్కనున్న మరికొన్ని కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలిదశ కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరుకుంది. వెబ్ ఆప్షన్లు గురువారంతో ముగియగా ఈ నెల 13న మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజుల గడువు లభించనుంది. ఈ నెల 18న తొలి దశ సీట్ల భర్తీ ఉంటుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య లక్ష దాటింది.
దాదాపు 40 వేల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 78 శాతం మంది కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఇందులోనూ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్, ఈసీసీ, ఈఈఈ, సీఈసీ వంటి కోర్సుల్లో మెజారిటీ విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా సీఎస్‌సీనే ఎంపిక చేసుకున్నారు. మిగతా కోర్ గ్రూపులకు పదవ ప్రాధాన్యతనిచ్చారు.
ఓపెన్ కేటగిరీకి 10 వేల లోపే..
ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ కోర్సుల్లో పోటీ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 171 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. వాటి పరిధిలో కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉండగా అందులో 68 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్, ఐటీ కోర్సులే ఉన్నాయి. తొలి దశలో 500 ర్యాంకు వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు.
వెయ్యి ర్యాంకు దాకా విద్యార్థులు సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సులతోపాటు ఇతర బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. వాళ్లంతా జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీలను ఎంచుకున్నారు. 2 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–10 కాలేజీలకు పోటీపడగా 5 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–20 కాలేజీలకు ప్రాధాన్యమిచ్చారు. 10 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను, అన్ని బ్రాంచీలను ఆప్షన్లుగా పెట్టుకున్నారు.
అయితే వారిలో 70 శాతం మంది కంప్యూటర్ కోర్సులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. ఈసారి నాన్–లోకల్ కోటా ఎత్తేయడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. టాప్–10 కాలేజీల్లో జనరల్ కేటగిరీలో సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో 4 వేల లోపు ర్యాంకు వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర కాలేజీల్లో 10 వేలలోపు ర్యాంకు వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు.
ఫీజులపై రగడ..
ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఖరారైన ఫీజులను నిలిపేయడం, పాత ఫీజులనే అమలు చేయాలనే నిర్ణయాన్ని సీబీఐటీ కాలేజీ న్యాయస్థానంలో సవాల్ చేసింది. కాలేజీకి సానుకూలంగా కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై శుక్రవారం విచారించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇతర కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు చేపడతారా లేక వాయిదా వేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాంకేతిక విద్యా విభాగం అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెబుతున్నారు. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.