హైదరాబాద్‌: అక్కడ ట్రాఫిక్‌ జామ్‌.. ఇలా వెళ్లండి | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: అక్కడ ట్రాఫిక్‌ జామ్‌.. ఇలా వెళ్లండి

Published Tue, Jun 14 2022 10:33 AM

Story On Motorists Face Problem with Huge Traffic Jams in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌కు చెందిన ఓ వాహనదారు అబిడ్స్‌ వెళ్లడానికి బయలుదేరారు. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు దిగ్బధించడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ విషయం ఆయనకు నిరంకారి దాటే వరకు తెలియలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఎంచుకోలేక ట్రాఫిక్‌లో  చిక్కుకుపోయారు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అనేక మంది వాహనచోదకుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రధానంగా పీక్‌ అవర్స్‌లో కార్యాలయాలకు వెళ్లడానికి, అత్యవసరమైన పనులపై బయటకు వస్తున్న వాళ్లు హఠాత్తుగా తలెత్తే అవాంతరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఇలాంటి హఠాత్పరిణామాలపై వాహన చోదకులను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.  

ఆ మళ్లింపులపై భారీ కసరత్తు... 
నగరంలో రహదారి, డ్రైనేజీ, ఫ్లైఓవర్‌.. ఇలా ఏదో ఒక నిర్మాణం, మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలను నిర్ణీత కాలం వరకు మళ్లిస్తుంటారు. దీనికోసం ట్రాఫిక్‌ పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు  చేసి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించడంతో పాటు అవసరమైతే మరమ్మతులు చేయిస్తారు. ఈ మళ్లింపులపై మీడియా, సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఆయా మార్గాల్లో ఫెక్సీలు సైతం ఏర్పాటు చేస్తారు. వాహనచోదకులు అడ్డంకులు ఉన్న మార్గంలో వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. 

హఠాత్తుగా వస్తే ఆగిపోవాల్సిందే... 
నగరం రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అనేక శాఖలు, సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి వాళ్లు నిరసనలు తెలపాలన్నా తమ ‘గొంతు అందరికీ వినిపించాలనే’ ఉద్దేశంతో దానికి ఇక్కడి కార్యాలయాలు, ప్రాంతాలనే ఎంచుకుంటారు. నిరసనల్లో కొన్ని అనుమతులు తీసుకుని జరిగితే, మరికొన్ని హఠాత్తుగా తెరపైకి వస్తాయి. మొదటి కేటగిరీకి చెందిన వాటితో ఇబ్బంది లేకున్నా రెండో రకమైన వాటి వల్ల తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తుంటాయి. భారీ ప్రమాదం లాంటివి జరిగినా పరిస్థితి ఇలానే ఉంటుంది.
చదవండి: కలెక్టర్‌ అవుదామని కలలు కని.. రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకుని.. 

సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారంతో..  
ఈ తరహా ట్రాఫిక్‌ జామ్స్‌పై ఆయా మార్గాల్లో వచ్చే వాహనచోదకులను నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే అప్రమత్తం చేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెల్‌ఫోన్‌ సేవలు అందిస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న, ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకుల ఫోన్‌ నెంబర్ల డేటా సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. ఈ సర్వీస్‌ ప్రొవైడర్లు ఓ ప్రాంతం పిన్‌కోడ్‌ నెంబర్‌ ఆధారంగా అక్కడ రిజిస్టర్‌ అయి ఉన్న, యాక్టివేషన్‌లో ఉన్న ఫోన్‌ నంబర్లను గుర్తించగలుగుతారు. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్లను గుర్తిచడం ద్వారా వారికి ట్రాఫిక్‌ జామ్‌పై సమాచారం ఇప్పించడానికి ట్రాఫిక్‌ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది.   
 
ఏ రూపంలో అనే అంశంపై సమాలోచన... 

ట్రాఫిక్‌ జామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీరి ద్వారా ఈ వివరాలు ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లకు చేరతాయి. ఈ సమాచారాన్ని వాహన చోదకుడి ఏ రూపంలో పంపాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. సంక్షిప్త సందేశం, ఆడియో క్లిప్, ఐవీఆర్‌ఎస్‌ తరహా కాల్‌... తదితర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లల్లో ఉన్న సైనేజ్‌ బోర్డుల ద్వారానూ ఈ అడ్డంకుల సమాచారాన్ని వాహనచోదకులకు తెలియజేయనున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ ఉన్న ప్రాంతానికి దారి తీసే మార్గాల్లోనే ఈ సందేశం కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు.   

బంజారాహిల్స్‌లో స్తంభించిన ట్రాఫిక్‌ 
బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని అగ్రసేన్‌ చౌరస్తాలో నీటి పైప్‌లైన్‌కు లీకేజీలు రావడంతో గత నాలుగు రోజుల నుంచి తవ్వకాలు చేపట్టి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నారు.  ఇరుకైన చౌరస్తాలో తవ్వకాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 వైపు, తెలంగాణ భవన్‌ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్‌ బస్సులన్నీ ట్రాఫిక్‌లో గంటల తరబడిగా చిక్కుకుపోయాయి. 

Advertisement
Advertisement