SLBC: టెన్నెల్‌లోకి క్యాడవర్‌ డాగ్స్‌ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే.. | SLBC rescue operation continues 14th Day live updates | Sakshi
Sakshi News home page

SLBC: టెన్నెల్‌లోకి క్యాడవర్‌ డాగ్స్‌ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే..

Mar 7 2025 10:38 AM | Updated on Mar 7 2025 11:11 AM

SLBC rescue operation continues 14th Day live updates

సాక్షి, దోమలపెంట: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక, తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్‌లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్‌ తీసుకెళ్లింది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌  వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్‌ డాగ్స్‌తో సహాయక బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం 2 గంటల తర్వాత టన్నెల్‌ నుంచి బయటకు రానుంది.

ఇదిలా ఉండగా.. టన్నెల్‌లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్‌ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.

మరోవైపు.. టన్నెల్‌లోని వ్యర్దాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్‌లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు  వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement