అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక | Sakshi
Sakshi News home page

అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక.. లబోదిబోమంటున్న పత్తి రైతు

Published Sun, Apr 16 2023 1:12 AM

The situation is confusing as the price of cotton gradually decreases - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తుమ్మిడే వెంకన్న. కుము రం భీం జిల్లా దహేగంకు చెందిన ఈయన పత్తి సాగు చేశాడు. ధర పెరుగుతుందనే ఆశతో ఇంట్లో 50 క్వింటాళ్ళ వరకు నిల్వ చేశాడు. ఆరు నెలల పాటు ఎదురుచూసినా పెరగకపోవడంతో క్వింటాల్‌ రూ.7,500 చొప్పున 20 క్వింటాళ్లు అమ్మేశాడు. మరో 30 క్వింటాళ్ళు ఇంట్లోనే నిల్వ ఉంది. అయితే ఎక్కువ రోజులు కావడంతో పురుగులు వస్తున్నాయని, పత్తి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మలేక, ఇంట్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది పత్తికి పలికిన ధర రైతుల్ని ఊరించింది. దీంతో ఈ ఏడాది పండించిన పంటను చాలామంది రైతులు అమ్మకుండా రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతుందనే ఆశతో వివిధ రకాలుగా నిల్వ చేశారు. కొందరు దళారుల మాట నమ్మి అమ్మలేదు. మరికొందరు సొంతంగానే వేచి చూడాలని నిర్ణయించుకున్నారు.

కొందరు క్వింటాళ్ల కొద్దీ పత్తి ని ఇళ్లలోనే దాచుకున్నారు. ఎలుకలు, పురుగులు, దుర్వాసన సమస్యను ఎదుర్కొంటూ నెలల తరబడి ఎదురుచూశారు. కానీ ధర పెరగలేదు సరికదా.. సీజన్‌ మొదట్లో ఉన్న ధర కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో పత్తిని నిల్వ చేసిన రైతులు పంటను మరింత కాలం నిల్వ చేయలేక, అలాగని అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. 

చెడిపోయిన 20 శాతం పత్తి  
రాష్ట్రంలో గత ఏడాది 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పండించారు. మొత్తం 28.41 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో ప్రైవేటు సంస్థలు 9.86 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, కొంతమంది పత్తి రైతులు మహారాష్ట్రలో 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అమ్ముకున్నారు. దాదాపు సగం పత్తిని రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందనే ఆశతో దాచిపెట్టారు. అయితే వారి ఆశ అడియాసే అయ్యింది. ప్రస్తుతం అమ్మకుండా నిల్వ ఉన్న 14 లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల పత్తిలో 20 శాతం మేర నల్లబడి, చెడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  

తెలుపు నుంచి నలుపులోకి.. 
పత్తిని నిల్వ చేసేందుకు కొందరు గోడౌన్లు అద్దెకు తీసుకుంటే మరికొందరు సొంత ఇళ్లల్లో దాచారు. కొందరు ఆరు బయటే కల్లాల్లో టార్పాలిన్‌ కవర్ల కింద కప్పిపెట్టారు. అయితే అమ్మకుండా ఎక్కువరోజులు కావడంతో పత్తి నుంచి వివిధ రకాల పురుగులు బయటకొస్తున్నాయి. ఎలుకల బెడదా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో దాచినవారికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కూడా వ్యాపిస్తోందని రైతులు చెబుతున్నారు.

మరోవైపు ఆరుబయట వర్షాలు, ఎండల తాకిడితో పత్తి రంగు నల్లగా మారుతోంది. పత్తికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే తెలుపు రంగు దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పత్తికే మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది. కానీ దిగుబడి వచ్చిన తర్వాత మూడు నెలలుగా నిల్వ చేయడంతో సరైన ఉష్ణోగ్రత లేక నల్లగా మారిపోతోంది. పత్తి గింజల నుంచి బంక లాంటిది బయటకొస్తోంది.

ఈ పరిస్థితుల్లో కొందరు పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ప్రయత్ని స్తున్నారు. కానీ అక్కడికి రవాణా, దళారులకు కమీషన్, ఇతరత్రా ఖర్చులు కలిపితే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఉంది. అయినా రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైతులు అక్కడే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మరొకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరకే అమ్ముకుంటున్నారు. 

పెరుగుతున్న వడ్డీ భారం 
ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు పత్తి సాగు కోసం ఖర్చు చేశాడు. కొందరు అప్పులు చేసి మరీ పంట వేశారు. సకాలంలో అమ్ముకుంటే అప్పు తీరిపోయేది. మిత్తి డబ్బులు కూడా మిగిలేవి. కానీ ప్రస్తుతం వడ్డీ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. దీంతో కొందరు కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
 
Advertisement