
14 రోజుల పాటు రెసిడెన్షియల్ తర్ఫీదు
గని ప్రమాదాల్లో రెస్క్యూపై మెళకువలు
భూగర్భ గనిలో రెస్క్యూ, రికవరీ శిక్షణ
ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, రెస్క్యూలో శిక్షణ, ఆపరేషన్‌కు వినియోగించే బ్రీతింగ్ ఆపరేటర్లు, పరికరాల్లేక వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో సమాచారం అందుకున్న సింగరేణి రెస్క్యూ బృందాలు వెంటనే టన్నెల్ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ అనుభవం రంగరించి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసింది.
గోదావరిఖని: ప్రకృతి వైపరీతాల్లో సేవలు అందిస్తున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) ప్రతినిధులకు సింగరేణి రెస్క్యూ ఫోర్స్ శిక్షణ ఇస్తోంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ను కళ్లారా చూసిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.. గనుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేలా రెసిడెన్షియల్ శిక్షణ తీసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 10వ బెటాలియన్‌కు చెందిన ఈ తొలిబ్యాచ్‌కు సింగరేణి మైన్స్ రెస్క్యూ శిక్షణ ఇస్తోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్ ఇందుకు వేదికగా మారింది. భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగితే ఆపరేషన్ చేయాల్సిన తీరుపై 14 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది.
సింగరేణి రెస్క్యూకు జాతీయస్థాయిలో ప్రత్యేకత
జాతీయ స్థాయిలో ప్రత్యేకత సంతరించుకున్న సింగరేణి రెస్క్యూ ద్వారా ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్‌డీఆర్‌ఎఫ్, మినిస్ట్రీస్ ఆఫ్ హోం ఎఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్), సింగరేణి సంస్థ సమష్టి నిర్ణయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌కు శిక్షణ ఇస్తున్నారు. భూగర్భ గనుల్లో ప్రమాదాలు, గనుల్లో చిక్కుకున్న ఉద్యోగులను సకాలంలో రక్షించడం, రెస్క్యూ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, అప్రమత్తత తదితర అంశాలపై 14 రోజులపాటు శిక్షణ ఇస్తారు.

తొలిబ్యాచ్‌లో 30 మంది..
ఎన్డీఆర్‌ఎఫ్ తొలిబ్యాచ్‌లో 30మంది సిబ్బంది ఉండగా, అందులో ప్రస్తుతం 20 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ బ్యాచ్‌కు సింగరేణి ఆర్జీ–2 ఏరియా పరిధిలో మూసివేసిన జీడీకే–7ఎల్‌ఈపీ గనిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ రికవరీ, బ్రీతింగ్ ఆపరేటర్స్, థియరీ, గ్యాస్ టెస్టింగ్ తదితర అంశాలు ఉంటున్నాయి. ఒక్కొక్క బెటాలియన్‌లో 18 బ్యాచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఎంతో నేర్చుకున్నాం
సింగరేణి రెస్క్యూ శిక్షణలో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఎన్‌డీఆర్‌ఎఫ్ శిక్షణలో అనేక విషయాలు నేర్చుకున్నా.. మైనింగ్ ప్రమాదాల్లో సేవలు అందించేందుకు ప్రస్తుత శిక్షణ దోహదం చేస్తుంది. – కమ్‌లేశ్‌సింగ్, ఇన్‌స్పెక్టర్, ఎన్‌డీఆర్‌ఎఫ్
భవిష్యత్‌లో తోడ్పాటు
ప్రస్తుత శిక్షణ భవిష్యత్‌తో ఉపయోగపడుతుంది. గని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం, ఇదే సమయంలో మాకు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తదితర అంశాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. – ఎన్.వెంకటేశ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సభ్యుడు
ఆత్మ విశ్వాసం నింపింది
గనుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. పైకప్పు కూలడం, విషవాయువులు వెలువడటం, విపత్తుల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ రికవరీలో శిక్షణ ఆత్మవిశ్వాసం నింపింది. కొత్త విషయాలు తెలిశాయి. – వాసుదేవరాజు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యుడు
సమగ్ర శిక్షణ ఇచ్చారు
రెస్క్యూ, రికవరీ, ఫస్ట్‌ఎయిడ్, గ్యాస్ డిటెక్షన్, బ్రీతింగ్ ఆపరేటర్ల వినియోగం తదితర అంశాలపై శిక్షణలో సమగ్రంగా వివరిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంతో కొత్త సవాల్ ఎదుర్కొన్నాం. అక్కడ సింగరేణి రెస్క్యూ పనితీరు అభినందనీయం. ఆ తర్వాతే సింగరేణి ద్వారా శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాం. – కిరణ్‌కుమార్, అసిస్టెంట్ కమాండెంట్