సింగరేణిలో ఇదేం వివక్ష ? 

Singareni Contract Workers Seek High Power Salaries, Covid Ex Gratia - Sakshi

కాంట్రాక్ట్‌ కార్మికులను పట్టించుకోని యాజమాన్యం

సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యం

కోవిడ్‌తో మృతిచెందిన వారి విషయంలోనూ పట్టింపులేదు

రెగ్యులర్‌ కార్మికులకు మాత్రమే చెల్లిస్తున్న ఎక్స్‌గ్రేషియా  

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా పరిగణించబడుతున్నారు. ఏడేళ్లుగా హైపవర్‌ వేతనాలు ఇచ్చే విషయంలోనూ పట్టింపు లేని సింగరేణి యాజమాన్యం.. కోవిడ్‌ బారిన పడిన కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. చివరకు కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్‌ కార్మికులకు పరిహారం చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి.

కరోనాతో మరణించిన కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని 2020 ఆగస్టు 14న కోలిండియా పరిధిలో జరిగిన 408వ బోర్డు మీటింగ్‌లో నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పర్మినెంట్‌ కార్మికులు మృతి చెందితేనే వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లిస్తున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు. ఈ వివక్షపై ప్రశ్నించినా ఫలితం లేదని, గుర్తింపు సంఘం నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కరోనాతో మృతిచెందిన కాంట్రాక్ట్‌ కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎన్‌.బలరామ్‌కు బీఎంఎస్‌ నాయకులు ఇటీవలే వినతిపత్రం అందజేశారు. గత ఏడాది కాలంలో సింగరేణి వ్యాప్తంగా 40 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు కరోనాతో మృతిచెందినట్లు గణాంకాల్లో ఉన్నా.. వారి కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారని, వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

విస్తృత సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు                                                        
కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు మాత్రం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి ఆసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ సెంటర్లలో పర్మినెంట్‌ కార్మికులు కోవిడ్‌ పేషంట్లను ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్‌ కార్మికులు కోవిడ్‌ పేషంట్ల మధ్య, మృతదేహాల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ పేషంట్లకు మందులు ఇవ్వకపోతే జీతం కట్, మృతిచెందిన వారిని పట్టుకోకుంటే ఉద్యోగం అవుట్‌ అంటూ కాంట్రాక్ట్‌ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు మోయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, మృతదేహాలను తరలిస్తూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్నారు.

మరోవైపు సివిక్, సివిల్, పారిశుద్ధ్యం, సులభ్, లోడింగ్, అన్‌లోడింగ్, రైల్వే క్రాసింగ్, అంబులెన్స్, కోల్‌ శాంప్లింగ్, గార్డెనింగ్, క్యాంటీన్స్, ఫిల్టర్‌బెడ్‌లలో నీటి శుద్ధి, ఆఫీస్‌ బాయ్స్, కంప్యూటర్‌ ఆ పరేటర్లు, బెల్ట్‌ క్లీనింగ్, బ్లాస్టింగ్, క్రషర్‌.. ఇలా పలు విభాగాలలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గనుల చట్టం 1952 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉంది. అ యినప్పటికీ నామమాత్రపు వేతనాలు చెల్లించి శ్రమదోపిడీకి గురిచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో సీఎం కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ వ్యవస్థను బానిస వ్యవస్థగా అభివర్ణించడంతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్పు లేదని కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏడేళ్లయినా అమలుకాని హైపపర్‌ వేతనాలు  
కోలిండియాలో కాంట్రాక్ట్‌ కార్మికులకు 2013 నుంచి హైపవర్‌ వేతనాలు అమలవుతున్నాయి. అయితే సింగరేణిలో హైపవర్‌ వేతనాలు అమలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు. చివరకు కనీస వేతనం జీవోను సైతం అమలు కావడం లేదు. ఒక పర్మినెంట్‌ కార్మికుడి జీతంతో సుమారు 10 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సింగరేణిలో పని చేస్తున్నారు. దీంతో సింగరేణికి కోట్లాది రూపాయలు మిగులుతున్నాయి. అయినా కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల యాజమాన్యం సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇన్సూరెన్స్‌ చేయడంతో పాటు, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు కోవిడ్‌ సోకితే మెరుగైన వైద్యం అందించాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయాలపై సింగరేణి జీఎం పర్సనల్‌ (ఐఆర్‌పీఎం) అందెల అనందరావును ‘సాక్షి’ వివరణ కోరగా కాంట్రాక్ట్‌ కార్మికుల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయమై బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top