సింగరేణి గని చూసొద్దామా?

Singareni Coal Mine Underground Tourism Will Be Available Soon - Sakshi

మూసివేసిన జీడీకే–7ఎల్‌ఈపీ గని పరిశీలన 

కేంద్రం ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి సంస్థ 

గోదావరిఖని: మీరెన్నడూ బొగ్గుగని చూడలేదా..? మరి ఇప్పుడు కుటుంబంతో సహా చూడాలనుకుంటున్నారా? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. సౌకర్యాల కల్పనపై కేంద్ర బొగ్గుగనుల శాఖ ఆదేశాల మేరకు సింగరేణి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సింగరేణి కూడా ఓ పర్యాటక ప్రాంతంగా మారబోతోంది.

ఇందులో భాగంగా ఇటీవలే మూసివేసిన జీడీకే–7ఎల్‌ఈపీ గనిని దీనికోసం ఎంపిక చేయాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు గనిలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించా రు. ఇప్పటికే కోలిండియాలో ఇలాంటివి రెండు గనులు ఉండగా.. సింగరేణిలోనూ ఏర్పాటు చేయబోతున్నారు.

సాంకేతిక కమిటీ పరిశీలించి గనిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి. రక్షణపరంగా సమస్యలేమిటి?.. ఇలా అనేక కోణా ల్లో పరిశీలించి నివేదిక అందిస్తుంది. 12 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎన్నో భూగర్భగనులు, ఓసీపీలను యాజమాన్యం మూసివేసింది. కానీ టూరిజం స్పాట్‌లుగా ఎక్కడా అభివృద్ధి చేయలేదు.  

గనిని పరిశీలించిన సాంకేతిక బృందం  
గోదావరిఖని పట్టణం సమీపంలోనే ఉన్న ఆర్జీ– 2 ఏరియా జీడీకే– 7ఎల్‌ఈపీ గనిని గురువారం సాంకేతిక కమిటీ పరిశీలించింది. ముందుగా మేనేజర్‌ కార్యాలయంలో గనికి సంబంధించిన మ్యాప్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ జీఎం సుభాని, సేఫ్టీ జీఎం గురువయ్య, జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంట్‌ జీఎం కొండయ్య, సివిల్‌జీఎం రమేశ్‌బాబు ఉన్నారు. 

అదృష్టమే..  
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు రావడంతో సంస్థ సీఎండీ, ఇటీవలే మూసివేసిన గనిని ఎంపిక చేసి టెక్నికల్‌ కమిటీని అధ్యయనానికి పంపడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతం టూరిజంలో అభివృద్ధి చెందుతుంది. సింగరేణి గనులను కుటుంబంతో సహా చూసే అవకాశం ప్రజలకు దక్కుతుంది.     
– సుభాని, ఆర్‌అండ్‌డీ జీఎం టీం కన్వీనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top