breaking news
gdk-7lep
-
సింగరేణి గని చూసొద్దామా?
గోదావరిఖని: మీరెన్నడూ బొగ్గుగని చూడలేదా..? మరి ఇప్పుడు కుటుంబంతో సహా చూడాలనుకుంటున్నారా? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. సౌకర్యాల కల్పనపై కేంద్ర బొగ్గుగనుల శాఖ ఆదేశాల మేరకు సింగరేణి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సింగరేణి కూడా ఓ పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. ఇందులో భాగంగా ఇటీవలే మూసివేసిన జీడీకే–7ఎల్ఈపీ గనిని దీనికోసం ఎంపిక చేయాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు గనిలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించా రు. ఇప్పటికే కోలిండియాలో ఇలాంటివి రెండు గనులు ఉండగా.. సింగరేణిలోనూ ఏర్పాటు చేయబోతున్నారు. సాంకేతిక కమిటీ పరిశీలించి గనిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి. రక్షణపరంగా సమస్యలేమిటి?.. ఇలా అనేక కోణా ల్లో పరిశీలించి నివేదిక అందిస్తుంది. 12 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎన్నో భూగర్భగనులు, ఓసీపీలను యాజమాన్యం మూసివేసింది. కానీ టూరిజం స్పాట్లుగా ఎక్కడా అభివృద్ధి చేయలేదు. గనిని పరిశీలించిన సాంకేతిక బృందం గోదావరిఖని పట్టణం సమీపంలోనే ఉన్న ఆర్జీ– 2 ఏరియా జీడీకే– 7ఎల్ఈపీ గనిని గురువారం సాంకేతిక కమిటీ పరిశీలించింది. ముందుగా మేనేజర్ కార్యాలయంలో గనికి సంబంధించిన మ్యాప్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జీఎం సుభాని, సేఫ్టీ జీఎం గురువయ్య, జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ జీఎం కొండయ్య, సివిల్జీఎం రమేశ్‌బాబు ఉన్నారు. అదృష్టమే.. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు రావడంతో సంస్థ సీఎండీ, ఇటీవలే మూసివేసిన గనిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీని అధ్యయనానికి పంపడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతం టూరిజంలో అభివృద్ధి చెందుతుంది. సింగరేణి గనులను కుటుంబంతో సహా చూసే అవకాశం ప్రజలకు దక్కుతుంది. – సుభాని, ఆర్అండ్డీ జీఎం టీం కన్వీనర్ -
ఆరని కన్నీటి తడి
గోదావరిఖని: జీడీకే-7ఎల్ఈపీ ఘోర దుర్ఘటనకు సోమవారంతో పదకొండేళ్లు నిండాయి. ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న 17 మంది కార్మికులు జలసమాధి అయ్యారు. 2003 జూన్ 16న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగి పదేళ్లు గడిచాయి. బొగ్గు వెలికితీసిన స్థలంలో ఇసుక నింపకపోవడం వల్లనే అందులో నీరు చేరిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ నాడు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఏటా జూన్ 16న మృతి చెందిన కార్మికులను స్మరించుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప చేసిందేమీ లేదని కార్మికులు అంటున్నారు. కార్మిక సంఘాలు గట్టి పట్టుతో డిమాండ్ చేయలేకపోవడం వల్లనే బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో పదకొండేళ్లుగా వారి కన్నీటి తడి ఆరడం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే.. 2003 జూన్ 16న ఉదయం షిఫ్టులో విధులకు వెళ్లిన 17 మంది కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటికే గనిలోని మూడో లెవల్లో ఊట నుంచి ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ప్రాణభయంతో తప్పించుకునే యత్నం చేశారు. కానీ అప్పటికే నీటి ప్రవాహం పెరగడంతో అందులో చిక్కుకున్నారు. హెడ్ ఓవర్‌మెన్ కైరి మల్లయ్య, ఎలక్ట్రీషియన్ రాపెల్లి మల్లయ్య, ఫిట్టర్ కుంట సమ్మయ్య, టింబర్‌మెన్ పుల్యాల నర్సయ్య, జనరల్ మజ్దూర్లు ఇజ్జగిరి రాంచందర్, దాసరి సత్యనారాయణ, ఆరెళ్లి వెంకటి, బదిలీ ఫిల్లర్లు రాగం బాపు, కె.వెంకటస్వామి, కుక్కల కొమురయ్య, కేవీ.శ్రీనివాస్, తాళ్ల తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, కోల్ఫిల్లర్లు కె.గోపాల్‌రెడ్డి, పులి వెంకటి, లెక్కల బుచ్చయ్య, ట్రామర్ తాడూరి రాయమల్లు జలసమాధి అయ్యారు. నీటిలో చిక్కుకోవడంతో శరీరాలు ఉబ్బి కనీసం మృతదేహాలను చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. విచారణ జరిగినా...చర్యలు శూన్యం ఈ ఘటనపై అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్ బిలాల్నజ్కీ, రిటైర్డ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఏకే.రుద్రా, ట్రేడ్ యూనియన్ నాయకుడు కమలేష్ సహాయ్‌తో కూడిన కమిటీ విచారణ చేసింది. సుమారు ఎనిమిది పర్యాయాలు గోదావరిఖని సింగరేణి బి-గెస్ట్‌హౌస్‌లో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతోపాటు డీజీఎంఎస్ అధికారులు గోదావరిఖని మున్సిఫ్ కోర్టులో సింగరేణి అధికారులపై దావా వేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ సంఘటన జరిగిన తర్వాత గని ఏజెంట్ నాగయ్య, మేనేజర్ రవితోపాటు సేఫ్టీ ఆఫీసర్, సర్వే ఆఫీసర్లను బాధ్యులు చేస్తు యాజమాన్యం కొంతకాలం వీరిని సస్పెన్షన్‌లో ఉంచింది. తర్వాత వీరందరికీ పదోన్నతులను కల్పించింది. 17 మంది కార్మికులు చనిపోయిన నేపథ్యంలో సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గనిని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను అడ్డుకుని ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో ఆయన రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఉన్నప్పటికీ గుర్తింపు సంఘాలు కూడా ప్రేక్షకపాత్ర వహించాయి. విచారణ పూర్తి చేసినప్పటికీ దాన్ని బహిర్గత పరచాలని ఏ సంఘం కూడా గట్టిగా పట్టుపట్టకపోవడం విచారకరం. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన నేపథ్యంలో నూతన ప్రభుత్వం మృతుల కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలని కార్మికవర్గం కోరుతోంది. నేడు గని వద్ద సంస్మరణ సభ జీడీకే-7 ఎల్ఈపీ గని ప్రమాదంలో మృతిచెందిన 17 మంది కార్మికులు, సూపర్వైజర్లను స్మరిస్తూ సోమవారం ఉదయం 7 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి గని అధికారులతోపాటు కార్మిక సంఘాల నాయకులు, మృతిచెందిన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు,స్నేహితులు హాజరుకానున్నారు.