బీమా చేయించి.. ఆపై చంపించి.. | Siddipet Son in law Took Life Of Mother In law for Insurance Money | Sakshi
Sakshi News home page

బీమా చేయించి.. ఆపై చంపించి..

Jul 13 2025 9:18 AM | Updated on Jul 13 2025 12:07 PM

 Siddipet Son in law Took Life Of Mother In law for Insurance Money

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అత్తను హత్య చేయించిన అల్లుడు

సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్‌పల్లిలో ఘటన 

నాలుగు నెలల ముందే అత్త పేరు మీద పోస్టాఫీస్, ఎస్‌బీఐలో రూ.60 లక్షల బీమా 

ప్లాన్‌ ప్రకారం జీపుతో ఢీకొట్టించి..రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం  

పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. 

ఇద్దరు నిందితుల అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ అనురాధ

సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్‌: ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్‌ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్‌ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. 

ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్‌ డయల్‌ 100కు కాల్‌ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్‌ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్‌ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్‌ కారు డ్రైవర్‌ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్‌ కలర్‌ తార్‌జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్‌ జీపు తుక్కాపూర్‌ వరకు నంబర్‌ ప్లేట్‌ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్‌ స్టిక్కర్‌ వేసినట్టు గుర్తించారు. 

ఎందుకు నంబర్‌ ప్లేట్‌ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్‌ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్‌పల్లికి చెందిన కరుణాకర్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్‌ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్‌ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు.  

ముందస్తు ప్లాన్‌ ప్రకారమే...
సిద్దిపేట కేసీఆర్‌నగర్‌కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్‌ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్‌ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్‌బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్‌ చేయించాడు. 

రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్‌కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్‌కు చెప్పాడు. వెంకటేశ్‌ గతంలోనే తాళ్ల కరుణాకర్‌కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్‌ పౌల్ట్రీఫామ్‌ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్‌లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్‌ కరుణాకర్‌ను ఒప్పించాడు. ప్లాన్‌లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్‌ కరుణాకర్‌కు ఫోన్‌ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్‌ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్‌ తన అత్త రామవ్వను ఎక్స్‌ఎల్‌ వాహనంపై పెద్దమాసాన్‌పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. 

కరుణాకర్‌ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్‌ జీపు (టీఎస్‌ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా టీఆర్‌ పేపర్‌ అతికించి పెద్దమాసాన్‌పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్‌ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్‌ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్‌కు వాట్సాప్‌ కాల్‌ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్‌ పేపర్‌ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. 

ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్‌ ఫోన్‌ కాల్‌ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్‌ కాల్స్‌ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్‌లను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన తార్‌ జీప్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement