Warangal: ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు

Seven Days Of Kakatiya Vibhava Saptaham Celebrations At Warangal - Sakshi

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సన్నాహక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించే విధంగా తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థి, యువత కూడా ఉత్సాహంగా పాల్గొనేలా, అందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: దిశ ఎన్‌కౌంటర్‌: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top