కోరలు లేని ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌.. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు!

Secunderabad Fire Tragedy: Experts Say changes Are Needed Telangana Fire Service Act 1999 - Sakshi

1999 నాటి చట్టంతోనే ఇప్పటికీ కేసులు

దీని ప్రకారం గరిష్ట శిక్ష కేవలం 3 నెలలే

ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ పడని వైనం

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 689 కేసులు

వీటిలో 83 కేసుల విచారణ మాత్రమే పూర్తి

జరిమానాలతో బయటపడిన ఉల్లంఘనులు 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. 


సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... 

ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్‌ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్‌ కోర్టుల్లో సమరీ ట్రయల్‌ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది.  


గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... 

ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది.  రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్‌ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 


హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు 

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్‌ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్‌ మొదలెట్టింది. 

అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్‌ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి:​​​​​​​ హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top