Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు

Hyderabad Metro Train: Grouting works in Nampally, Lakdikapool Route - Sakshi

కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థలో తరచూ లోపాలు

తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్‌ మార్గంలో ట్రాక్‌కు మరమ్మతులు

అకస్మాత్తుగా 15 కేపీఎంపీహెచ్‌కు పడిపోతున్న మెట్రో రైళ్ల వేగం

సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్‌ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్‌ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్‌ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. 


సాంకేతిక చిక్కులు.. 

► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్‌ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. 


► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్‌ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  


రద్దీ పెరుగుతోంది.. 

ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్‌– మియాపూర్‌ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్‌– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా–  ఈ పనులు రయ్‌..రయ్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top