Secret Treasures: Task Force Police Seize 30 Copper Coins in Warangal - Sakshi
Sakshi News home page

తండ్రి మాట ప్రకారం.. నిమ్మకాయలు, నల్లకోడి కోసి తవ్వకాలు.. పక్కా సమాచారంతో..

Feb 7 2022 2:43 PM | Updated on Feb 7 2022 7:49 PM

Secret Treasures: Task Force Police Seize 30 Copper Coins In Warangal - Sakshi

రాగి నాణేలు చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, గీసుకొండ(వరంగల్‌): అరేయ్‌.. చేనులో చెట్టుకింద గుప్తనిధులు ఉన్నాయి.. తవ్వుకుని తీసుకోండి, నాకేదో గుబులుగా ఉంది.. అంటూ ఓ తండ్రి తరచుగా తన కుమారులకు చెబుతుండేవాడు.. గుప్తనిధి విషయం కలలో వస్తోందని తండ్రి పదే పదే మొత్తుకున్నా వారు ఆసక్తి చూపలేదు. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. అతడు చెప్పినట్లు కుమారులు గుప్తనిధుల కోసం చెట్టుకింద తవ్వ కాలు చేపట్టగా.. 30 రాగి నాణేలు బయటకు వచ్చాయని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో యార కొమురయ్య అనే రైతుకు మల్లారెడ్డి, రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డి అనే నలుగురు కుమారులున్నారు.

కాగా మల్లారెడ్డికి 1.8 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో తండ్రి మాట ప్రకారం గత నెల 23న తన అన్నదమ్ములు, మహబూబాబాద్‌ జిల్లా గూడూరుకు చెందిన పంజరబోయిన శ్రీనివాస్, గంగ దేవిపల్లికి చెందిన మేడిద కృష్ణ,నెక్కొండ మండలం అమీన్‌పేటకు చెందిన యాటపూర్ణచందర్‌ అనే పురోహితుడి సాయంతో నల్లకోడి, నిమ్మకాయలను కోసి పూజలు చేసి ఐదు చోట్ల లోతు గోతిని తవ్వారు. వారి తవ్వకాల్లో 1818నాటి పురాతనమైన 30 రాగి నాణేలు లభ్యం కాగావాటిని మష్‌ అనే మధ్యవర్తి సహకారంతో హైదరాబాద్‌లో విక్రయించడానికి ప్రయత్నించగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం ప్రణాళిక ప్రకారం పట్టుకుని, నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాలుగు సెల్‌ఫోఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

యార రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డిలు పరారీలో ఉన్నారని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. కాగా, పురాతనమైన రాగినాణేలు లక్ష్మీగణపతి, ఆంజనేయస్వామి, వినాయకుడు, అమ్మవారి రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. అడిషనల్‌ డీసీపీ ఐపీఎస్‌ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సై ప్రేమానందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా, టాస్క్‌ఫోర్స్‌ అందింన వివరాల ప్రకారం తవ్వకాల్లో ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేసి నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు.
చదవండి: Gadwal Bidda: ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ గద్వాల్‌ బిడ్డ కన్నుమూత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement