ఆరేళ్ల ప్రాజెక్టు.. యాక్సిడెంట్లు తగ్గేట్టు

Road Ministry chalks out Rs 7 trillion infra projects plan over 2 to3 years - Sakshi

దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి 

ఆరేళ్లలో రూ.7,270 కోట్లు ఖర్చు చేసేలా ప్లాన్‌ 

నిధుల్లో 50 శాతం సమకూర్చుకోనున్న కేంద్రం 

మిగతావి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి..

యాక్సిడెంట్లు, మరణాలు 30 శాతం తగ్గేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం ఆరేళ్ల ప్రాజెక్టును అమలు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఈ ఆరేళ్లలో రూ. 7,270 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 50 శాతం మొత్తాన్ని కేంద్ర రహదారుల శాఖ కేటాయించనుండగా, 25 శాతం ప్రపంచ బ్యాంకు, మిగతా మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అందించనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాలకు మొత్తంగా రూ.6,725 కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది. ఇందులో రాష్ట్రానికి రూ. 320 కోట్లు రానున్నాయి. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా, హోం, వైద్యారోగ్య, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కలుపుకొని ప్రాజెక్టును కేంద్రం అమలు చేయబోతోంది. 

2019 నాటి ప్రమాదాల ప్రకారం.. 
ప్రస్తుతం దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. వాహనాల సంఖ్య బాగా పెరుగుతుండటం, అందుకు తగ్గట్టు డ్రైవింగ్‌ నైపుణ్యం అభివృద్ధి చెందకపోవటం, ప్రమాణాలతో రోడ్లు అందుబాటులో లేకపోవటంతో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టకుంటే పరిస్థితి క్రమంగా భయానకంగా మారుతుందని గుర్తించిన కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచితే తప్ప పరిస్థితి మారదని నిర్ణయించి చర్యలు తీసుకోబోతోంది. 2019లో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆ సంవత్సరం మన రాష్ట్రంలో 21,588 ప్రమాదాలు జరిగాయి. వీటన్నింటిలో కలిపి 6,800 మంది మృతి చెందగా 22,265 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల తీవ్రత, రోడ్‌ నెట్‌వర్క్‌ విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించింది.  

మార్కులేస్తూ.. డబ్బులిస్తూ.. 
ప్రాజెక్టులో భాగంగా 14 రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రమాణాలను రూపొందించి కచ్చితంగా పాటించేలా గైడ్‌లైన్స్‌ రూపొందించింది. వాటి అమలు ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు ఇవ్వనుంది. అలా వచ్చిన మార్కుల ఆధారంగా ఏటా నిధులను విడుదల చేయనుంది. వచ్చే ఆరేళ్లలో ప్రమాదాల సంఖ్యలో కనీసం 30 శాతం తగ్గాలని, ముఖ్యంగా మృతుల సంఖ్య అంతమేర తగ్గిపోవాల్సి ఉంటుందని కేంద్రం లక్ష్యంగా విధించింది. తొలి ఏడాది 3%  మేర మృతుల సంఖ్య తగ్గాలని, ఆ తర్వాతి ఐదేళ్లలో వరుసగా 7.5%, 13.5%, 19.5%, 25.5%, 30 % వరకు తగ్గిపోవాలని చెప్పింది.  

ప్రమాదాల నివారణకు కేంద్రం మార్గదర్శకాలు.. 
రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ సంబంధిత అంశాల్లో శిక్షణ ఇవ్వాలి.
 
రోడ్లపై నిర్ధారిత వేగాన్ని మించకుండా పరికరాలు సమకూర్చుకోవాలి. 

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు రూపొందించాలి.
 
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి లోపాలను సరిదిద్దాలి. 

వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలను కఠినంగా అమలు చేయాలి. 

నిబంధనలు పాటించని వాహనదారులకు పెనాల్టీలు విధించాలి. 

ప్రమాదాలు జరిగితే వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందేలా అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
 
అంబులెన్సులు సమకూర్చుకోవాలి. వాటి నిర్వహణ పక్కాగా ఉండాలి.
 
ప్రధాన రోడ్లపై ద్విచక్ర వాహనాలకు విడిగా మార్కింగ్‌ ఉండాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top