నిమిషాల్లోనే వజ్రాల తయారీ!

RIMT Scientists Say Within Minutes The Making Diamond At Room Temperature - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వజ్రాలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా..? కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపల విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగిన కర్బన పదార్థం కాస్తా ఘనీభవించినప్పుడు వజ్రమవుతుంది.. అంత పురాతనమైనవి, అతి తక్కువగా లభ్యమయ్యేవి కాబట్టే వాటికంత విలువ.. అయితే వీటిని నిమిషాల్లో తయారు చేస్తామంటున్నారు ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. డైమండ్‌ అన్‌వెయిల్‌ సెల్‌ అనే ఓ పరికరం ద్వారా ఇది సాధ్యమేనని వారు చెబుతున్నారు. భూమి లోపలి ఒత్తిడి, ఉష్ణోగ్రతల పరిస్థితులను ఈ పరికరంలో కృత్రిమంగా సృష్టించవచ్చన్నారు. 640 ఆఫ్రికన్‌ ఏనుగులు ఒక మేజోడు కొనపై కాలు మోపితే ఎంత ఒత్తిడి ఏర్పడుతుందో అంత అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరం లోపల సృష్టించినప్పుడు దాంట్లో ఉన్న కర్బన అణువులు కాస్తా స్ఫటికాలు (వజ్రాలు) గా మారిపోయాయని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోడీ బ్రాడ్‌బై తెలిపారు. (చదవండి: పొలాల్లో ‘వజ్రాల పంట’)

కేవలం ఒత్తిడిని సృష్టించడంతోనే వజ్రం తయారు కాలేదని, కర్బన అణువులపై షీర్‌ ఎఫెక్ట్‌ (మెలితిప్పడం, జారిపోవడం వంటివి) కూడా పడినప్పుడే స్ఫటికాలు ఏర్పడతాయని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలను ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపు సాయంతో పరిశీలించామన్నారు. ఇవి సాధారణ వజ్రాలతోపాటు ఉల్కా శకలాల కారణంగా ఏర్పడ్డ వజ్రాల్లోని లక్షణాలు రెండూ కలిగి ఉన్నాయని బ్రాడ్‌బై వివరించారు. ఈ పరిశోధన వివరాలు స్మాల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top