
ఐదు నెలల్లో 12 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్
కొన్నింటిలో ‘హైదరాబాద్ రేప్ కేసు’ ప్రస్తావన
పొరపాటున వైఫై కనెక్ట్ కావడంతో కటకటాల్లోకి
రోబోటిక్ ఇంజినీర్ రినే జోషిదా వ్యవహారం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు 22 బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన కేసులో నిందితురాలు రినే జోషిదా ఆద్యంతం చాలా తెలివిగా వ్యవహరించింది. తాను ఇష్టపడిన వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన రినే అతడి పేరునే వినియోగించింది. డార్క్ వెబ్, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సహాయంతో తన ఆచూకీ బయటపడకుండా ఐదు నెలల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన రినే.. ఆమెకు తెలియకుండా జరిగిన వైఫై కనెక్టివిటీతో చిక్కింది. ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఈమెను శంషాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి శనివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
ఉన్నత విద్య.. ఎమ్మెన్సీ ఉద్యోగం..
చెన్నైకి చెందిన రినే జోషిదా తొలుత ఇంజినీరింగ్, ఆపై రోబోటిక్స్‌లో అడ్వాన్డ్స్ కోర్సు చేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ (ఎమ్మెన్సీ) డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా తమ సంస్థలో ఉద్యోగం ఇచి్చంది. ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేసిన రినే తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్‌ను ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈమె ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్షకట్టిన రినే కటకటాల పాలు చేయడం ద్వారా భార్య నుంచి విడగొట్టాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడం కోసం పక్కా పథకం ప్రకారం కథ నడిపింది.
ప్రభాకర్ పేరుతో మెయిల్ ఐడీలు..
తొలుత రినే తన ల్యాప్‌టాప్ నుంచి డార్క్‌వెబ్‌ను యాక్సస్ చేసింది. దాని ద్వారానే తన వివరాలు పొందపరచకుండా ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వీపీఎన్ ద్వారా ఇంటర్‌నెట్‌ను యాక్సస్ చేసే రినే.. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. ఒక ప్రాంతానికి పంపిన మెయిల్‌లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు, దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికే బాంబు పెట్టినట్లు రాసింది. అహ్మదాబాద్‌కు పంపిన ఓ ఈ–మెయిల్‌లో ‘2023లో హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్‌లో బాంబు పేల్చబోతున్నారు’ అంటూ ప్రస్తావించింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న ఆయా పోలీసులు దర్యాప్తు చేశారు.
ఆ ప్రమాదం తర్వాత తీవ్రంగా పరిగణించి..
ఇలా రినే తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హరియాణా, గుజరాత్‌ల్లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆమె ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. పోలీసులు ప్రభాకర్‌ను అనుమానితుగా భావించడం, విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి. అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రినే మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచి్చన 22 ఈ–మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేసింది.
ఆ పొరపాటుతో ఆమె ఆటలకు చెక్...
ఈ ఏడాది ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌కు రినే ఇలానే బెదిరింపు మెయిల్ పంపింది. ప్రతి సందర్భంలోనూ డార్క్‌వెబ్ ద్వారా, వీపీఎన్ నెట్‌వర్క్ వాడటంతో ఆమె వివరాలు పోలీసులకు చిక్కలేదు. ఆయా సందర్భాల్లో వైఫై ఆఫ్ చేసి ఉండే రినే.. మొబైల్ డేటా ద్వారానే హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకుని, వీపీఎన్‌ను యాక్టివేట్ చేసింది. అయితే ఏప్రిల్‌లో మెయిల్ పంపుతున్న సందర్భంలో పొరపాటున రినే ల్యాప్‌టాప్ ఆమె నివసిస్తున్న వైఫైకి కనెక్ట్ అయింది. దీంతో ఆ మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ రికార్డుల్లో నమోదైంది. ఈ వివరాలను సాంకేతికంగా సేకరించిన గుజరాత్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రినే ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు లోకేషన్ సంగ్రహించారు. గత వారం చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు.