‘పాలమూరు– రంగారెడ్డి’కి రూ.13,500 కోట్ల రుణాలు 

REC And PFC Likely To Provide Loan For Palamuru Rangareddy - Sakshi

అంగీకరించిన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సంస్థలు 

పర్యావరణ చిక్కులు తొలగితే విడుదల చేస్తామని హామీ 

ఎన్జీటీ స్టేతో రూ.3వేల కోట్ల పాత రుణం నిలుపుదల 

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.13,500 కోట్ల అదనపు రుణం ఇవ్వడానికి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ)లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. చెరో రూ.6,750 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే, పర్యావరణ అనుమతుల్లేని కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) విధించిన స్టేతోపాటు ఇతర న్యాయ వివాదాలు తొలగిన తర్వాతే రుణాలు ఇస్తామని నిబంధన పెట్టాయి.

ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, అనుమతులు లభించిన తర్వాత స్టే తొలగిపోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.920.85 కోట్ల జరిమానా విధిస్తూ గత నెలలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌ ఇంకా విచారణకు రావాల్సి ఉంది.  

స్టేతో ఆగిన రూ.3వేల కోట్ల రుణం 
కాళేశ్వరం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణాలను పీఎఫ్‌సీ నుంచి సమీకరించేందుకు గతంలో ఒప్పందం జరగగా, ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను పీఎఫ్‌సీ విడుదల చేసింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ విధించిన స్టే తొలగిన తర్వాతే మిగిలిన రూ.3వేల కోట్లను విడుదల చేస్తామని పీఎఫ్‌సీ పేర్కొంటోంది.  

రోజుకు ఒక టీఎంసీ తరలింపు 
న్యాయవివాదాలతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిచిపోయినా, అప్పటికే రోజుకు ఒక టీఎంసీ సామర్థ్యంతో కృష్ణా జలాల తరలింపునకు వీలుగా పనులు జరిగినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 67 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మిస్తుండగా, తొలి నాలుగు రిజర్వాయర్లయిన నార్లపూర్, ఏదుల, వట్టేం, కరివేనలకు శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు వీలుగా పంపులు, మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి.

చివరి రెండు రిజర్వాయర్లు అయిన ఉదండపూర్, లక్ష్మీదేవిపల్లిలకు నీళ్లను పంపింగ్‌ చేసే పంపులు, మోటార్లతోపాటు సొరంగం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉదండపూర్‌ జలాశయం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను పంపింగ్‌ చేసేందుకు మధ్యలో 14 కి.మీ. సొరంగాన్ని నిర్మించాల్సి ఉంది. సొరంగానికి ప్రత్యామ్నాయంగా ఉదండపూర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top