వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ..

Ranga Reddy : Political Leaders Sons Ready To Contest In Assembly Parliament - Sakshi

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి సై అంటున్న కీలక నేతల తనయులు

 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ సంకేతాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీకి పలువురు ముఖ్య నేతల తనయులు సై అంటున్నారు. గతంలో ఉమ్మ డి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలే కా కుండా.. ప్రస్తు తం కీలక పదవు ల్లో ఉన్న వారి తన యులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీరిలో కొందరు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. వీరితో పాటు మరికొంత మంది యువ నాయకులు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికలకు ఏడాదిపైగా ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తున్నారు.

కేవలం పార్టీ కార్యక్రమాల్లోనే కాదు బంధువులు, కార్యకర్తలు, సామాజిక వర్గం ప్రజలు, అభిమానులు ఇలా ఎవరి ఇళ్లలో ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్‌ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధిష్టానాల వద్ద పావులు కదుపుతున్నారు.  

మాస్‌ టు క్లాస్‌.. 
శేర్‌లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ ఈసారి ఎన్నికల్లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది క్రితం ఈయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. విద్యార్థి, యువజన నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. తరచూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాడు. అటు మాస్‌తో పాటు ఇటు క్లాస్‌ పీపుల్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు.   

పట్నం’పై ప్రశాంత్‌ కన్ను 
టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సుదీర్ఘ కాల ఎమ్మెల్యేగా పని చేయడం, వయసు మీదపడటంతో తన స్థానంలో కుమారుడిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌కు కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉంది.  

షాద్‌నగర్‌లో పాగా కోసం.. 
మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు ఏపీ మిథున్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గతంలో ఆయన తండ్రి టీఆర్‌ఎస్‌ ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తండ్రితో పాటు ఆయన కూడా బీజేపీ గూటికి చేరాడు. షాద్‌నగర్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు.   
చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

తండ్రి బాటలో రవీంద్రుడు 
షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పెద్ద కుమారుడు వై.రవీందర్‌ యాదవ్‌ కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేశంపేట్‌ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి స్థానంలో తరచూ నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే.. పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం.   

గెలుపే లక్ష్యంగా.. 
మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్‌రెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నారు. 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన శివారులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. బయటకు కనిపించకపోయినా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 111జీవో ఎత్తివేత అంశంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేశాడు.   

ఈసారైనా దీవిస్తారా.. 
మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి చేవేళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top