‘10 టన్నుల’ హెలికాప్టర్లపై దృష్టి పెట్టాలి

Rajnath Singh Calls For Progress On 10 Tonne Multirole Helicopters - Sakshi

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడి

భారత్‌.. ఆధిపత్యం కోసం ఎప్పుడూ యుద్ధం చేయలేదు

‘చేతక్‌’ డైమండ్‌ జూబ్లీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్‌

కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): దేశ రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘చేతక్‌’హెలికాప్టర్‌ డైమండ్‌ జూబ్లీ కాన్‌క్లేవ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేతక్‌.. దేశానికి సేవలందించిన గొప్ప యుద్ధవిమానం. రాణాప్రతాప్‌ గుర్రాన్ని గుర్తు చేసుకునేలా ఈ హెలికాప్టర్‌కు ‘చేతక్‌’అనే నామకరణం చేశారు.

ఇది ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ నేటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్‌.. ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల డిజైన్, డెవలప్‌మెంట్, ఆపరేషన్‌లతో సత్తా చాటింది. ఇక 10 టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ‘ఆత్మ నిర్భరత’ను సాధించాల్సిన అవసరం ఉంది.

దేశీయ ఆయుధ సంపత్తి, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు రక్షణ దళాలు, శాస్త్రవేత్తలు, రక్షణ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దేశీయ పరిశ్రమలకు సైతం డీఆర్‌డీఓ ద్వారా శాస్త్ర, సాంకేతిక సహకారం అందించనుంది. ఈ రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. భారత్‌ ఏనాడూ అధికారం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం యుద్ధం చేయలేదు.

ప్రజాస్వామ్యం, మానవత్వ పరిరక్షణ కోసమే యుద్ధం చేసింది. ఈ కాన్‌క్లేవ్‌ దేశ సేవలో అమరులైన వారికి ఘన నివాళి వంటింది’అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి సహా త్రివిధ దళాల హెలికాప్టర్‌ విభాగం ఉన్నతాధికారులు, రిటైర్డ్‌ అధికారులు, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, హెచ్‌ఏఎల్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top