తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య  ప్రొటోకాల్‌ వివాదం.. అసలేం జరిగింది!

Protocol Dispute Between Telangana Government And Tamilisai Soundararajan - Sakshi

గవర్నర్‌కు హెలికాప్టర్‌ సమకూర్చని ప్రభుత్వం 

మేడారం జాతర ముగింపునకు ఒకరోజు ముందు హెలికాప్టర్‌ కావాలని కోరిన గవర్నర్‌ కార్యాలయం

సీఎం కేసీఆర్‌ వెళ్తారని.. అందుకే సమకూర్చలేదని సమాచారం! 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ప్రొటోకాల్‌ వివాదం ముదురుతోంది. మేడారం జాతరలో గవర్నర్‌ తమిళిసైకి ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్‌ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్‌ మేడారం వెళ్తారని, హెలికాప్టర్‌ సమకూర్చాలని గవర్నర్‌ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు.

అయితే అదేరోజు కాస్త ముందుగా సీఎం కేసీఆర్‌ జాతరకు వెళ్తున్నారని, ప్రభుత్వం వద్ద ఉన్నది ఒక హెలికాప్టర్‌ మాత్రమేనని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సీఎం హెలికాప్టర్‌లో మేడా రం వెళ్తారనే సమాచారం ముందుగానే ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్‌ కార్యాలయం హెలికాప్టర్‌ కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. చివరికి గవర్నర్‌ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లిన విషయం తెలిసిందే. గవర్నర్‌ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయడం, కోవిడ్‌ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య విభేదాలు పొడచూపాయి.  

ఢిల్లీకి గవర్నర్‌ ప్రొటోకాల్‌ వివాదం 
రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మేడారం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించిన అంశం ఢిల్లీకి చేరింది. మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున(19న) దర్శనానికి గవర్నర్‌ ముందుగానే షెడ్యూల్‌ ఇచ్చారు. గవర్నర్‌ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్‌ మీట్‌’నిర్వహించారు. తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి జాయింట్‌ కలెక్టర్‌ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే సీతక్క వేర్వేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంలో గవ ర్నర్‌ పర్యటనను తేలికగా తీసుకోవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు  ఆరా తీస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top