చుక్క నీటినీ వదలొద్దు | protect rights of the state in Godavari, Krishna rivers says Kcr | Sakshi
Sakshi News home page

చుక్క నీటినీ వదలొద్దు

Jul 31 2020 2:37 AM | Updated on Jul 31 2020 4:48 AM

protect rights of the state in Godavari, Krishna rivers says Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :
సాగునీటి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్రం నిష్క్రియాపరత్వం..
రెండు రాష్ట్రాల మధ్యనున్న జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అభిప్రాయపడింది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మద్య ముందు నుంచీ వివాదాలు నెలకొని ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్‌–13ని అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవినపెట్టిందని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందని, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సూచించింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తేదీ మార్చాలి..
అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే, ఆ తేదీన ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన సమావేశంలో వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని సమావేశం సూచించింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్‌.కె.జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే, రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ నాగేందర్‌రావు, సీఈ నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement