ప్రీలాంచ్‌ మాయ.. గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్న డెవలపర్లు!

Prelaunch Developers Are wooing Home Buyers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అమీన్‌పూర్‌లోని 10 ఎకరాల స్థల యజమానితో ఓ డెవలప్పర్‌ రెండేళ్ల క్రితం డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. 65 లక్షల చదరపు అడుగులు (చ.అ.) బిల్టప్‌ ఏరియాలో 4 వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నానని ప్రచారం చేశాడు. నిర్మాణ అనుమతులు రాకముందే చ.అ.కు రూ.2 వేల చొప్పున 2 వేల ఫ్లాట్లను విక్రయించాడు. తీరా చూస్తే ఆ భూమి న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ఇంకేముంది కొనుగోలుదారుల నుంచి ముందుగానే రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన డెవలపర్‌ సైలెంటైపోయాడు’..

ఇలా ప్రీలాంచ్‌ డెవలపర్లు గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్నారు. సామాన్యుల సొంతింటి కలలను కొల్లగొడుతున్నారు. కాస్త తక్కువ ధరకు వస్తుందనే కొనుగోలుదారుల బలహీన మనస్తత్వంతో ప్రీలాంచ్‌ డెవలపర్లకు మంత్రదండంలా ఉపకరిస్తోంది. స్థల యజమానులతో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకొని నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే ఫ్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. 

ఐటీ దాడులైతే కష్టమే.. 
ప్రీలాంచ్‌ విక్రయాలలో డెవలపర్‌కు చేరేది నల్లధనమే. అనధికారిక లావాదేవీలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆయా సొమ్మును పలు ప్రాజెక్ట్‌లకు లేదా ఇతర ప్రాంతాలలో స్థలాల కొనుగోళ్లకు వినియోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సదరు నిర్మాణ సంస్థపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తే గనక.. అసలుకే మోసం వస్తుందని ఓ డెవలపర్‌ తెలిపారు. అనధికారిక నగదును, బ్యాంక్‌ ఖాతాలను స్థంభింప చేస్తారు. దీంతో సదరు నిర్మాణ సంస్థ ఇతర ప్రాజెక్ట్‌లపై దీని ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. నగదు సరఫరా మందగించడంతో ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

అందరూ అందరే.. 
కోకాపేట, ఖానామేట్‌ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు, నానక్‌రాంగూడలో హైరైజ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లీహిల్స్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ.. పెద్ద కంపెనీలతో పాటు చిన్నా చితకా సంస్థలూ ప్రీలాంచ్‌లో విక్రయాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట వంటి ప్రాంతాలలో ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. 

ఈ లాజిక్‌ తెలిస్తే చాలు.. 
నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్‌ + గ్రౌండ్‌ + అయిదంతస్తుల భవన నిర్మాణానికి చదరపు అడుగు (చ.అ.)కు రూ.2,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.3 వేలు, 15–25 ఫ్లోర్ల వరకు రూ.3,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.4 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్‌ అయినా ఇంతకంటే తక్కువ ధరకు అపార్ట్‌మెంట్‌ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని క్రెడాయ్‌ తెలంగాణ సెక్రటరీ కె.ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.  

(చదవండి: నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్‌ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top