breaking news
pre launch function
-
యథేచ్ఛగా ‘ప్రీలాంచ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి ఆశలను కొందరు బిల్డర్లు అడియాసలు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దందా నిర్వహిస్తూ, ఆకర్షణీయమైన హామీలు ఎరవేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన సాహితీ, భువనతేజ, ఓబిలీ హౌసింగ్ వంటి సంస్థల యజమాను లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికు బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా కొంపల్లిలో భారతి లేక్‌వ్యూ పేరిట అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రీలాంచ్ ఆఫర్ పెట్టి రూ.60 కోట్లు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వరకు వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, ప్రీలాంచ్ ఆఫర్ల వలలో చిక్కుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్‌లో కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఈ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ వెంచర్ల విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సైతం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తక్కువ ధరకే చదరపు అడుగు పేరిట..హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలామందికి సొంతంగా 100 లేదా 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న ఉద్యోగులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస వస్తున్న వారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కోకాపేట, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్చెరు తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బడా సంస్థలు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్లు కరీంనగర్, వరంగల్, విజయవాడ, మెదక్ హైవేల వైపు దృష్టి సారించి నాలుగైదేళ్ల క్రితమే ఈ ప్రీలాంచ్ దందాకు తెరతీశారు. అంటే ప్రజల ఆశనే పెట్టుబడిగా పెట్టి ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడం అన్నమాట. అపార్ట్మెంటులో ఫ్లాట్ చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5వేల లోపు నిర్ణయించి, నిర్మాణానికి ముందే చెల్లించే పక్షంలో ఇలా తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరహా వెంచర్లు హైదరాబాద్ పరిసరాల్లో వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తవుతున్నప్పటికీ మోసపోయిన వాళ్లే అధికంగా ఉంటుండటం గమనార్హం. డబ్బులు చెల్లించినప్పటికీ సరైన సమయంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బిల్డర్ల చుట్టూ కోర్టులు, పురపాలక సంస్థలు, ‘రెరా’ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నోటీసులకే పరిమితమవుతున్న ‘రెరా’రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడం, వినియోగదారుడి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘రెరా’ను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది ఏడాది క్రితం వరకు నామ మాత్రంగానే ఉండిపోయింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గత సంవత్సరం జూన్‌లో ‘రెరా’ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొంత కార్యాచరణ మొదలైందని చెప్పవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించి, తదనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ‘రెరా’కు సైతం పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేకపోతోంది. ప్రీలాంచ్ ఆఫర్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, ప్రకటనలు విడుదల చేసినా నోటీసులు జారీ చేసి, చర్యలకు స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థలకు రిఫర్ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రీలాంచ్ మోసాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రీలాంచ్ దందాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కూడా ప్రభుత్వం వీటిపై సరైన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
ప్రీలాంచ్ మాయ.. గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్న డెవలపర్లు!
సాక్షి, హైదరాబాద్: ‘అమీన్‌పూర్‌లోని 10 ఎకరాల స్థల యజమానితో ఓ డెవలప్పర్ రెండేళ్ల క్రితం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 65 లక్షల చదరపు అడుగులు (చ.అ.) బిల్టప్ ఏరియాలో 4 వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నానని ప్రచారం చేశాడు. నిర్మాణ అనుమతులు రాకముందే చ.అ.కు రూ.2 వేల చొప్పున 2 వేల ఫ్లాట్లను విక్రయించాడు. తీరా చూస్తే ఆ భూమి న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ఇంకేముంది కొనుగోలుదారుల నుంచి ముందుగానే రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన డెవలపర్ సైలెంటైపోయాడు’.. ఇలా ప్రీలాంచ్ డెవలపర్లు గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్నారు. సామాన్యుల సొంతింటి కలలను కొల్లగొడుతున్నారు. కాస్త తక్కువ ధరకు వస్తుందనే కొనుగోలుదారుల బలహీన మనస్తత్వంతో ప్రీలాంచ్ డెవలపర్లకు మంత్రదండంలా ఉపకరిస్తోంది. స్థల యజమానులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే ఫ్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఐటీ దాడులైతే కష్టమే.. ప్రీలాంచ్ విక్రయాలలో డెవలపర్‌కు చేరేది నల్లధనమే. అనధికారిక లావాదేవీలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆయా సొమ్మును పలు ప్రాజెక్ట్‌లకు లేదా ఇతర ప్రాంతాలలో స్థలాల కొనుగోళ్లకు వినియోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సదరు నిర్మాణ సంస్థపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తే గనక.. అసలుకే మోసం వస్తుందని ఓ డెవలపర్ తెలిపారు. అనధికారిక నగదును, బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేస్తారు. దీంతో సదరు నిర్మాణ సంస్థ ఇతర ప్రాజెక్ట్‌లపై దీని ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. నగదు సరఫరా మందగించడంతో ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ అందరే.. కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు, నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ.. పెద్ద కంపెనీలతో పాటు చిన్నా చితకా సంస్థలూ ప్రీలాంచ్లో విక్రయాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట వంటి ప్రాంతాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఈ లాజిక్ తెలిస్తే చాలు.. నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్ + గ్రౌండ్ + అయిదంతస్తుల భవన నిర్మాణానికి చదరపు అడుగు (చ.అ.)కు రూ.2,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.3 వేలు, 15–25 ఫ్లోర్ల వరకు రూ.3,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.4 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్ అయినా ఇంతకంటే తక్కువ ధరకు అపార్ట్‌మెంట్‌ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ కె.ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. (చదవండి: నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా ) -
ఖైదీ ఫంక్షన్ ముగించండి.. ఐజీ ఆదేశం
ఖైదీ నెం.150 చిత్ర ప్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారు. హాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముంగించాలని ఐజీ సంజయ్ ఆదేశించినట్లు తెలిసింది. వేదికపైకి వెళ్లిన పోలీసు ఉన్నతాధికారులు.. అల్లు అరవింద్‌తో చర్చించారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, అందువల్ల దయచేసి ఫంక్షన్ వెంటనే ముగించాలని చెప్పారు.